Khajuraho: ఎత్తు పెరుగుతున్న శివలింగం...యుగాంతానికి దారి చూపుతున్న నిధి

ఖజురాహో మాతంగేశ్వర మహాదేవ ఆలయంలోని శివలింగం ప్రతి ఏడాది ఎత్తు పెరుగుతోందనే విశ్వాసం భక్తులను ఆశ్చర్యపరుస్తోంది.

Update: 2026-06-06 05:26 GMT

Khajuraho: ఖజురహో అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది గుహల్లో చెక్కిన శృంగార శిల్పాలు, అద్భుతమైన కట్టడాలు. కానీ, ఇక్కడే యుగాంతానికి దారిచూపే మహాద్భుతం కూడా దాగుంది. అదే మాతంగేశ్వర మహాదేవ ఆలయం. ఈ గుడిలోని శివలింగం ప్రతి ఏటా కొద్ది కొద్దిగా పెరుగుతున్నది. కలియుగాంతానికి సంబంధించిన ఓ రహస్యాన్ని ఈ దేవాలయం గుర్తుచేస్తున్నట్టు చాలా మందికి తెలియదు. ఆ మర్మమేంటో ఇప్పుడు చూద్దాం.


ప్రతి ఏటా పెరుగుతున్న శివలింగం

మాతంగేశ్వర ఆలయంలోని గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగం సామాన్యమైనది కాదు. ప్రస్తుతం ఈ శివలింగం భూమిపైకి 9 అడుగుల ఎత్తు, భూమి లోపలికి 9 అడుగుల లోతు.. మొత్తం 18 అడుగుల భారీ పరిమాణంలో దర్శనమిస్తుంది. ఇక్కడి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ప్రతి ఏటా శరదృతువు అంటే కార్తీకమాసం సమయంలో ఈ శివలింగం ఒక నువ్వు గింజ లేదా పుట్టుమచ్చ పరిమాణంలో పైకి, కిందకి కూడా పెరుగుతుందని భక్తుల నమ్మకం. శతాబ్దాల క్రితం సాధారణ పరిమాణంలో ఉన్న ఈ లింగం, కాలక్రమేణా పెరుగుతూ ఇప్పుడు ఈ స్థాయికి చేరింది. నాస్తికులు, శాస్త్రవేత్తలు దీనిని భూగర్భంలో జరిగే భౌగోళిక మార్పులుగా కొట్టిపారేస్తున్నా, ఇప్పటివరకు దీనికి ఎలాంటి శాస్త్రీయ నిరూపణ లభించలేదు. ఆంధ్రప్రదేశ్‌లోని యాగంటి బసవన్నలాగే, ఈ మాతంగేశ్వరుడు కూడా నిత్యం పెరుగుతూ భక్తులను అబ్బురపరుస్తున్నాడు.

18 అడుగుల రహస్యం.. యుగాంతం...నిధి రహస్యం

ఈ శివలింగం వెనుక ఒక భయంకరమైన పురాణ గాథ ప్రచారంలో ఉంది. స్థానిక పండితులు, పురాణాల ప్రకారం.. భూమి పైన ఉన్న ఈ 9 అడుగుల శివలింగం, ఎప్పుడైతే క్రమంగా పెరుగుతూ 18 అడుగులకు చేరుకుంటుందో, అలాగే కింద ఉన్న భాగం పూర్తిగా భూమిలోకి కుంగిపోతుందో, అప్పుడు ఈ కలియుగం అంతమవుతుంది. ఇక ఈ ఆలయం కింద అపారమైన, అనంతమైన దైవిక నిధి దాగి ఉందని చరిత్రకారులు సైతం భావిస్తారు. ఆ నిధిని ఎవరూ దొంగిలించకుండా ఉండేందుకే, దానిపై ఈ శక్తివంతమైన శివలింగాన్ని ప్రతిష్టించారని అంటారు. శివలింగం 18 అడుగుల ఎత్తుకు చేరినప్పుడు, ఆ భూగర్భ నిధి ఒక్కసారిగా బయటపడుతుందని, ఆ నిధి వల్ల వచ్చే శక్తులే యుగాంతానికి దారితీస్తాయని నమ్ముతారు.

చందేల రాజుల వైభవం

క్రీస్తుశకం 9 నుంచి 10వ శతాబ్దాల మధ్య బుందేల్‌ఖండ్ పాలించిన చందేల వంశపు రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఖజురహోలోని మిగతా ఆలయాలన్నీ శిథిలావస్థకు చేరినా, కేవలం ఈ మాతంగేశ్వర ఆలయం మాత్రమే ఇప్పటికీ సజీవంగా, నిత్య పూజలతో వెలుగుందుతోంది. ఇది నాగర్ శైలిలో నిర్మించబడింది.పెరుగుతున్న ఈ శివలింగం నిజంగా దైవలీలా? లేక ప్రకృతి మాయా? అనేది పక్కన పెడితే.. కలియుగ మానవుడికి భక్తిని, కాస్త భయాన్ని కలిగిస్తూ ఈ క్షేత్రం నేటికీ విరాజిల్లుతోంది. యుగాంతం నిజమో కాదో తెలియాలంటే.. ఆ శివలింగం 18 అడుగులు పెరిగేంత వరకు వేచి చూడాల్సిందే!  

Tags:    

Similar News