Lord Venkateswara Swamy: ప్రపంచంలో ఎవరూ ఇలా వివాహం చేసుకోలేరు... తిరుమల నుంచి శ్రీశైలం వరకు వడ్డించారట

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వివాహాన్ని మనం చూడలేకపోయినా..కనీసం ఆ విశేషాలను చదివినా విన్నా పుణ్యం లభిస్తుంది. స్వామివారి వివాహా మహోత్సవాన్ని చదివే సమయంలో మన పక్కనే ఉంటారని పెద్దలు చెబుతున్నారు.

Update: 2026-06-04 04:34 GMT

Lord Venkateswara Swamy: కలియుగదైవం కొలువైన తిరుమల క్షేత్రాన్ని నిత్యకళ్యాణం... పచ్చతోరణం అని చెబుతారు. తిరుమల శ్రీవారి కైంకర్యాలను చూస్తే ఎవరికైనా సరే ఆశ్చర్యం వేస్తుంది. నిత్యం వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకొని, పెళ్లివిందులో భోజనాలు చేసిన విధంగా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు. సామాన్యుల నుంచి రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల వరకు స్వామిని దర్శించుకొని తరించిపోతుంటారు. ఈ విశ్వంలో ఎవరూ చేసుకోలేని విధంగా శ్రీవేంకటేశ్వరుని వివాహం జరిగింది. మరి ఆ విశేషాలేంటో చూద్దామా.

ఆకాశమే పందిరిగా వివాహం

శ్రీవేంకటేశ్వర స్వామి వివాహం సమయంలో అవసరమైన ధనాన్ని కుబేరుడి నుంచి వడ్డీగా తీసుకున్నాడు. ఎంత ధనం తీసుకున్నాడు అంటే ఇప్పటికే ఆయన దానికి వడ్డీకడుతున్నారని చెబుతారు. అంటే ఇంత ఖర్చు అయింది అని మనం కనీసం లెక్కకూడా వేయలేం. ముక్కోటి దేవతలు దిగొచ్చి ఈ వివాహాన్ని దగ్గరుండి జరిపించారు. ఐదు రోజులపాటు అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. వివాహంలో అత్యంత ముఖ్యమైనవి మర్యాదలు, పెళ్లి భోజనాలు. వీటిల్లో ఏ ఒక్కటి తగ్గినా జరిగే రభస అంతాఇంత కాదు. పెద్ద యుద్ధాలే జరిగిన సందర్భాలు ఉన్నాయి. స్వామివారి వివాహానికి సమస్త భూమండలం అంతా హాజరైంది. వీరందరికీ భోజనాలు పెట్టాలి అంటే మామూలు విషయమా చెప్పండి. ఇంతమందికి వంట చేసే బాధ్యతను అగ్నిదేవుడు తీసుకున్నాడు. ఆయన మాత్రమే ఈ కార్యాన్ని పూర్తిచేయగలడు.

తరలివచ్చిన దేవతలు...విందుభోజనం

ముక్కోటి దేవతలు, సమస్త భూమండలం కదిలిరావడంతో అంతమందికి కావలసిన పాత్రలు ఎక్కడ దొరుకుతాయి. అందుకే శ్రీనివాసుడు వేంకటాచలంలో వంటలు చేయించాడు. వేంకటాచలంలో అక్షయ పాత్రలు ఉన్నాయి. వాటిల్లో మాత్రమే వంట చేయడం సాధ్యమౌతుంది. వంటకు కావలసిన నీరు తిరుమల గిరుల్లోని తీర్థాల నుంచి ఉపయోగించారు. పాపనాశనంలో పులుసు, పప్పును, స్వామి పుష్కరిణిలో అన్నాన్ని, ఆకాశగంగలో బెల్లం పరమాన్నం, దేవ తీర్థంలో కూరలు, తుంబుర తీర్థంలో పులిహోర, కుమారతీర్థంలో భక్ష్యాలు, పాండు తీర్థంలో సాంబారు, ఇతర తీర్థాల్లో లేహ్యాలను తయారు చేయించారు. ఇక పొంగళ్ల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నిరకాల పొంగళ్లు ఉన్నాయో అన్నింటినీ ఆ అగ్నిదేవుడు వండేశాడు.

తిరుమల నుంచి శ్రీశైలం వరకు

వచ్చినవారందరికీ వడ్డించాలంటే ఓ చిన్న ప్రదేశం సరిపోదు. అందుకే తిరుమల నుంచి శ్రీశైలం వరకు భోజనాలకు ఏర్పాట్లు చేశారు. వడ్డన పూర్తయ్యాక స్వామివారికి నైవేద్యం సమర్పించాలి కదా. వేంకటాచలంలో తయారైన వంటకాల్లో నుంచి కొంత భాగాన్ని అహోబిలంలో కొలువైన నరసింహస్వామికి నివేదించారు. ఈ నివేదన తరువాత వడ్డన ప్రారంభమైంది. తిరుమల నుంచి శ్రీశైలం వరకు విస్తరించిన కొండలనే శేషాచలం కొండలని పిలుస్తారు. శేషాచలం అంటే శేషుడు అని అర్థం. ఇక్కడ శేషుడి తల తిరుమలలోనూ, మధ్యభాగం అహోబిలంలోనూ, తోకభాగం శ్రీశైలంలోనూ ఉంటుంది. ఈ పెళ్లికి ఆయనే పెద్ద కావడంతో శేషాచలంలో వడ్డన చేశారు. వడ్డించే బాధ్యతను మహాశివుడు స్వీకరించాడు. భోజనాలన్నీ పూర్తయ్యాక చివరన శ్రీనివాసుడు, వకులాదేవి, మన్మథుడు, లక్ష్మీదేవి, మహాశివుడు, బ్రహ్మదేవుడు, గరుత్మంతుడు, ఆదిశేషుడు కలిసి భోజనం చేసినట్టుగా మన పురాణాలు చెబుతున్నాయి. ఇంతమందికి భోజనాలు పూర్తయ్యే సరికి సూర్యస్తమయం అయిందని, ఆ రాత్రికి అక్కడే బసచేసి ఆ మరుసటిరోజు నారాయణవనం బయలుదేరి వెళ్లినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. ఇంత గొప్పగా జరిగిన వివాహాన్ని, విందును మనం కూడా చదివినా, విన్నా పుణ్యం వస్తుందని, వివాహం కానివారికి వివాహయోగం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.   

Tags:    

Similar News