Angkor Wat: వెయ్యేళ్ల క్రితమే అద్భుతం... ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం

ప్రపంచంలో అతిపెద్ద దేవాలయం అంగ్‌కోర్‌వాట్‌. కాంబోడియాలో ఉన్న ఈ దేవాలయం అద్భుతమైన శిల్పసంపదతో పాటు ఆశ్చర్యపరిచే ఇంజనీరింగ్‌ పనితనం కూడా ఉన్నది.

Update: 2026-07-11 02:53 GMT

Angkor Wat: సనాతన ధర్మం భారత సరిహద్దులకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రాచీన కాలంలోనే మన సంస్కృతి సముద్రాలు దాటి, విదేశాల్లోనూ తన ముద్రను వేసింది. అందుకు సజీవ సాక్ష్యం కాంబోడియాలోని ‘అంగ్‌కోర్‌ వాట్’. ఇది కేవలం ఒక కట్టడం కాదు, హిందూ సంస్కృతి యొక్క విశ్వవ్యాప్త వైభవానికి నిదర్శనం. మరి ఈ నిదర్శనం గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందామా.

ఆలయ చరిత్ర... నిర్మాణం

12వ శతాబ్దంలో కాంబోడియాను పాలించిన రాజు రెండవ సూర్యవర్మన్ ఈ అద్భుతానికి అంకురార్పణ చేశారు. దాదాపు 30 సంవత్సరాల పాటు వేలాది మంది శిల్పుల కఠోర శ్రమతో రూపుదిద్దుకున్న ఈ దేవాలయం, ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కట్టడంగా రికార్డు సృష్టించింది. 200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ క్షేత్రం, భారతీయ దేవాలయాల నిర్మాణ శైలిని, ముఖ్యంగా చోళుల కాలం నాటి శిల్పకళను గుర్తుకు తెస్తుంది.

ఆనాటి ఇంజనీరింగ్ అద్భుతం

సాధారణంగా హిందూ దేవాలయాలు తూర్పు ముఖంగా ఉంటాయి. కానీ అంగ్‌కోర్‌ వాట్ పశ్చిమ ముఖంగా ఉండటం ఇక్కడ ఒక ప్రత్యేకత. నాటి ఇంజనీర్లు ‘బారే’ పేరుతో భారీ రిజర్వాయర్లను నిర్మించారు. నీరు ఎత్తు నుంచి పల్లానికి ప్రవహించడం సహజం, కానీ ఇక్కడ నీటిని పల్లం నుంచి ఎత్తుకు మళ్లించే అద్భుత టెక్నాలజీని వాడారు. నాసా శాస్త్రవేత్తలు కూడా ఈ ఆలయ జల నిర్వహణ వ్యవస్థను చూసి ఆశ్చర్యపోయారంటే, మన పూర్వీకుల మేధస్సు ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.

దైవ సంకల్పం...

ఈ ఆలయం వైష్ణవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందినప్పటికీ, ఇక్కడ త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువై ఉండటం మరో విశేషం. రామాయణ, మహాభారత ఇతిహాస ఘట్టాలు శిల్పాలుగా ఇక్కడ జీవం పోసుకున్నాయి. దక్షిణ మండపంలో ఉండే సైనిక పటాలు, అప్సరసల నాట్య విన్యాసాలు నాటి సంస్కృతిని నేటి తరానికి కళ్లకు కట్టినట్టు చూపుతాయి. ఎన్నో యుద్ధాలు, విపత్తులు జరిగినప్పటికీ, తలవంచకుండా నిలబడిన ఈ అంగ్‌కోర్‌ వాట్, మన సనాతన ధర్మం ఎంతటి శక్తివంతమైనదో ప్రపంచానికి చాటిచెబుతోంది. ఈ ఆలయాన్ని సందర్శించడం అంటే కేవలం పర్యాటక యాత్ర కాదు, మన మూలాలను వెతుక్కుంటూ వెళ్లే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. జీవితంలో ఒక్కసారైనా చూడవలసిన వాటిల్లో ఇది కూడా ఒకటి.  

Tags:    

Similar News