Lord Srikrishna: ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి...పాండవులు అడిగిన ఐదు ఊర్లు ఇవే
శ్రీకృష్ణుడి రాయబారం వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసా? నిజంగానే పాండవులు ఐదు ఊర్లు కావాలని అడిగారా... తెలుసుకుందాం.
Lord Srikrishna: సంధి...రాయబారం ఈ రెండూ అత్యంత కీలకమైనవి. వీటిని నడిపించాలంటే చతురత కావాలి. శ్రీకృష్ణుడిలా లౌక్యాన్ని ప్రదర్శించాలి. ఇద్దరి మధ్యగాని, రెండు వర్గాల మధ్యగాని, రెండు ప్రాంతాల మధ్యగాని సంధి చేయాలంటే తప్పకుండా కన్నయ్య మనోగతాన్ని అర్ధం చేసుకొని దానికి తగ్గట్టుగా ప్రవర్తించాలి. అసలు శ్రీకృష్ణుడు రాయబారాన్ని ఎలా నడిపించారో, పాండవులు అడిగిన ఆ ఐదు ఊర్లు ఏమిటో తెలుసుకుందాం.
నిజ జీవితంలో రాయబారం
రాయబారంలో పాండవుల తరపున మాట్లాడేందుకు గోవిందుడు కురుసభకు వస్తాడు. రాజసింహాసనంపై రాజు కూర్చొని ఉన్నాడు కాబట్టి ఆ పదవికి గౌరవం ఇచ్చి సభలో కురు మహారాజు దృతరాష్ణుడిని ఉద్దేశించి మాత్రమే శ్రీకృష్ణుడు మాట్లాడతాడు. కుశలప్రశ్నల దగ్గరి నుంచి కురుపాండవుల మంచిచెడ్డల వరకు దృతరాష్ణుడితోనే మాట్లాడతాడు శ్రీకృష్ణుడు. నిత్య జీవితంలో మనం కూడా ఏ పనిమీద దృష్టిసారిస్తామో ఆ పనిచుట్టే, ఆ పనితోనే మాట్లాడాలి, ఆ పనిని ప్రేమించాలి... ఎంతటి కష్టమైనా చేయవలసిన పనిని సులభంగా మార్చుకునేలా ముందుకు సిద్దం కావాలి.
ఇక రెండో పాయింట్‌కు వస్తే దృతరాష్ణుడితో మాట్లాడిన తరువాత... కురురాజు చెప్పింది ఓపికగా విని, ఆయన మాట్లాడమంటేనే శ్రీకృష్ణుడు కౌరవులతో మాట్లాడాడు. నా కుమారులు నా మాట వినరు...నువ్వే చెప్పిచూడు అని దృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడితో చెబుతాడు. ఇక్కడ సామాజికపరంగా మనం ఆలోచించాలి. పిల్లలు చెడు మార్గంలో పయనిస్తున్నారంటే దానికి తల్లిదండ్రులే మూలకారణం. కౌరవులు తప్పుడు మార్గంలో, తప్పుడు ఆలోచనలతో ఉన్నారు అంటే దానికి ప్రధాన కారణం దృతరాష్ట్రుడే. నా కుమారులు నా మాట వినరు అని మూడో వ్యక్తి వద్ద ప్రస్థావించేంత వరకు వచ్చింది అంటే ఎంతగా చెడిపోయారో అర్ధం చేసుకోవచ్చు. చెడు ఆలోచనలు చేసే వారికి కౌరవులను ఉదాహరణగా చూపి సన్మార్గంలో నడిపించేలా చేయాలి నా మాట వినరు అని చెప్పిన తరువాత శ్రీకృష్ణుడు కలుగజేసుకోవలసి వచ్చింది.
కౌరవుల ఆలోచన... దృతరాష్ట్రుడి వేదన
న్యాయబద్ధంగా వచ్చిన రాజ్యాన్ని పాండవులు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే పరిపాలించారు. జూదం కారణంగా 13 ఏళ్లపాటు సొంత రాజ్యానికి దూరందగా ఉండిపోయారు. ఎలాంటి వారినైనా జూదం ఎలా కిందకు తోసేస్తుందో చెప్పడానికి మహాభారతంలోని ఈ ఘట్టంచాలు. 13 ఏళ్లపాటు దూరంగా ఉన్న సమయంలో రాజ్యాన్ని తిరిగి ఇవ్వాలని కోరలేదు. షరతు ప్రకారమే అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేశారు. షరతు కాలవ్యవధి ముగిస్తే రాజ్యాన్ని తిరిగి ఇచ్చేయాలి. ధర్మపాలకులు చేయవలసిన ధర్మం అది. కానీ, కౌరవులు అలా చేయలేదు. పాండవులకు రాజ్యాన్ని ఇవ్వకూడదు అన్నది కౌరవుల ఆలోచన. ఇతరుల ఆస్తులపై కన్నేస్తే చివరకి ఏం జరుగుతుందో... ఎలాంటి గతి పడుతుంతో మహాభారతంలోని రాయబార ఘట్టం చూస్తే అర్ధమౌతుంది. కురు రాజ్యాన్ని కౌరవులు ఇవ్వకున్నా...యుద్ధంలో గెలచి స్వాదీనం చేసుకోగల శక్తి పాండవులకు ఉంది. యుద్ధాన్ని పాండవులు కోరుకోలేదు...కానీ, యుద్ధంలో పాండవులను ఓడించాలన్నదే కౌరవుల లక్ష్యం. యుద్ధం చేస్తే రాజ్యం కోల్పోతామని, తమ బంధువులంతా మరణిస్తారని దృతరాష్ట్రుడికి తెలుసు.
ఐదు ఊర్ల ప్రతిపాదన
ఇరు పక్షాలవారు కన్నయ్యకు కావలసిన వారే. ధర్మం తప్పకుండా ఉండాలని కోరుకున్నాడు. మద్యేమార్గంగా కొన్ని రాయబారంలో కొన్ని సూచనలు చేశాడు. ఎవరి తండ్రిపాలు వారికే చెందాలి. పాండురాజు ఇచ్చిన రాజ్యాన్ని వారికే ఇవ్వడం ధర్మం. ఇలా చేస్తే లోకం మిమ్మల్ని మెచ్చుకుంటుందని శ్రీకృష్ణుడు రాయబార సభలో దృతరాష్ట్రుడితో చెప్పగా... మహారాజు మౌనం వహించినట్టుగా మహాభారతం చెబుతున్నది. అయితే, శ్రీకృష్ణుడు రాయబారంలో కనీసం ఐదు ఊర్లైనా ఇవ్వాలనే ప్రతిపాదనను తీసుకొచ్చినట్టుగా చెప్పబడలేదు. శ్రీకృష్ణుడు రాయబారానికి రావడానికి ముందే దృతరాష్ట్రుడు సంజయుడిని పాండవుల వద్దకు పంపుతాడు. అక్కడ పాండవులతోనూ శ్రీకృష్ణుడితోనూ సయోధ్యను నిర్వహిస్తాడు సంజయుడు.
ఈ సందర్భంగా పాండవ ప్రధముడైన ధర్మరాజు ఐదు ఊర్ల ప్రస్తావన తెచ్చినట్టుగా తిక్కన రచనలో కనబడుతుంది. తిక్కన రచనలో పేర్కొన్న ఐదు ఊర్లు కుశస్థలం, వృకస్థలం, వాసంతి, వారణావతముతో పాటు మరొక ఊరిని ఇవ్వమని చెబుతాడు. మరో కవి రచయిత పుల్లెల శ్రీరామచంద్రుడు తన గ్రంధంలో చెప్పిన ఊర్లు అవిస్థలం, వృకస్థలం, మాకంది, వారణావతముతో పాటు మరో ఊరు. ఈ ఐదు ఊర్లను ఇవ్వాలని సంజయుడితో ధర్మరాజు చెబుతాడు. కానీ, ఎక్కడా శ్రీకృష్ణుడు ఐదు ఊర్లు ఇవ్వాలని రాయబారంలో చెప్పినట్టుగా లేదు. రాయబారం నడిపే వాళ్లు తన వాళ్లకు ఏదైతే అవసరమో దానిపై మాత్రమే దృష్టిసారించి పని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తారు. ఐదు ఊర్లతో పాండవులకు ఒరిగేది ఏమీ లేదని శ్రీకృష్ణుడికి తెలుసు. ఐదు ఊర్లు ఇచ్చేందుకు అటు కౌరవులు కూడా సిద్దంగా లేరు. పైగా రాయబారానికి వచ్చిన శ్రీకృష్ణుడిని ఆమాట ఈ మాట చెప్పి లొంగదీసుకోవాలని దృతరాష్ట్రుడు ప్లాన్ చేస్తాడు. కానీ, ఆ పాచిక పారకపోవడంతో చివరకు యుద్ధానికి దిగవలసి వస్తుంది.