Sanatana Dharma: మీ కెరీర్ ఇబ్బందుల్లో పడిందా...మీరు చేసిన ఈ దానాలే కావొచ్చు
సాయంత్రం ప్రదోష సమయం తరువాత ఈ వస్తువులను ఎట్టిపరిస్థితుల్లోనూ దానం చేయకూడదు. కారణం ఏంటో తెలుసుకుందాం.
Sanatana Dharma: మన దైనందిన జీవితంలో పొరుగువారితో వస్తువులను పంచుకోవడం చాలా సాధారణమైన విషయం. అయితే, తెలిసో తెలియకో మనం చేసే కొన్ని చిన్న చిన్న వంటింటి దానాలు లేదా అరువులు మన కెరీర్‌ను ముంచేస్తాయని, ఆర్థికంగా, వైవాహికంగా తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తాయని జ్యోతిష్య శాస్త్రం హెచ్చరిస్తోంది. సనాతన సంప్రదాయం ప్రకారం, వంటింట్లో ఉండే కొన్ని వస్తువులు నిర్దిష్ట గ్రహాలకు, దైవ శక్తులకు ప్రతీకలు. వాటిని ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత ఇతరులకు ఇవ్వడం వల్ల ఇంట్లోని లక్ష్మీదేవి అలిగి వెళ్లిపోతుందని పండితులు చెబుతున్నారు. సౌభాగ్యాన్ని కాపాడుకోవడానికి ఏ వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం.
పసుపు ...బృహస్పతి స్వరూపం
సనాతన ధర్మంలో పసుపు అత్యంత పవిత్రమైనది. ఇది కేవలం వంటింటి దినుసు కాదు... సాక్షాత్తూ శుభకారకుడైన దేవగురు బృహస్పతి స్వరూపం. పసుపును ఇతరులకు అప్పుగా ఇవ్వడం అంటే మీ ఇంట్లోని అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని చేతులారా వేరేవారికి ఇచ్చేయడమే. ఇలా చేయడం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్లు ఆగిపోవడం, వ్యాపారంలో నష్టాలు రావడం, వివాహ ప్రయత్నాల్లో తీవ్రమైన ఆటంకాలు ఎదురవుతాయి.
ఉప్పు ...లక్ష్మీదేవి నివాసం
క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవితో పాటు ఉద్భవించింది ఉప్పు. అందుకే ఉప్పును లక్ష్మీస్వరూపంగా భావిస్తారు. ముఖ్యంగా సూర్యాస్తమయం అయిన తర్వాత అంటే సాయంత్రం 6 గంటల దాటిన పిమ్మట పక్కింటి వారికి ఉప్పును అప్పుగా ఇవ్వడం కానీ, వారి నుండి తీసుకోవడం కానీ అస్సలు చేయకూడదు. దీనివల్ల మీ ఇంట్లో అప్పుల బాధలు పెరిగిపోతాయి.
పాలు, పాల పదార్థాలు ..చంద్రుని ప్రతీక
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం పాలను మనస్సుకు కారకుడైన చంద్రునితో పోలుస్తాం. సూర్యాస్తమయం తర్వాత పాలను గాని, పెరుగు, మజ్జిగ వంటి పాల పదార్థాలను గాని ఇతరులకు ఇవ్వడం అస్సలు మంచిది కాదు. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత కరువవుతుంది, ఇంట్లో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ఉల్లి, వెల్లుల్లి ...రాహు-కేతువుల ప్రభావం
పురాణాల ప్రకారం ఉల్లి, వెల్లుల్లి ఉత్పత్తుల వెనుక రాహు-కేతువుల ప్రభావం ఉంటుందని నమ్ముతారు. సాయంసంధ్యా సమయంలో వీటిని ఇతరులకు ఇవ్వడం లేదా వారి నుండి యాచించడం వల్ల ఇళ్లలో ప్రతికూల శక్తులు ప్రవేశించి, కుటుంబ సభ్యుల మధ్య సుఖసంతోషాలు హరించుకుపోతాయి. సహాయం చేయడం మంచిదే, కానీ శాస్త్ర నియమాలను అతిక్రమించి చేసే పనులు మన సొంత ఎదుగుదలను దెబ్బతీస్తాయి. కాబట్టి ఈ ముఖ్య వస్తువులైన పసుపు, ఉప్పు, పాలు, ఉల్లిపాయల విషయంలో లక్ష్మీప్రదోష సమయాల్లో అప్రమత్తంగా ఉండండి... మీ కెరీర్‌ను సురక్షితంగా ఉంచుకోండి.