Cockroach Janata Party: ఏంది భయ్యా ఇది.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘కాక్రొచ్ జనతా పార్టీ’..!

Cockroach Janata Party: సామాజిక మాధ్యమాల్లో ‘కాక్రొచ్ జనతా పార్టీ’ సరికొత్త సంచలనం సృష్టిస్తోంది.

Update: 2026-05-21 02:54 GMT

Cockroach Janata Party: ఏంది భయ్యా ఇది.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘కాక్రొచ్ జనతా పార్టీ’..!

Main Bhi Cockroach: ఇప్పుడు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్న సరికొత్త ట్రెండ్ ఇది. నిరుద్యోగ యువతను హేళన చేస్తూ వచ్చిన ఓ వ్యాఖ్య.. ఇప్పుడు దేశంలోనే అత్యంత వేగంగా దూసుకుపోతున్న ఒక వినూత్న డిజిటల్ నిరసన ఉద్యమానికి దారితీసింది. అదే ‘కాక్రొచ్ జనతా పార్టీ’. సాధారణంగా వ్యవస్థపై కోపం వస్తే రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడం, నినాదాలు చేయడం చూస్తుంటాం. కానీ నేటి డిజిటల్ తరం మాత్రం రూటు మార్చింది. తగిలిన అవమానాన్నే ఒక పదునైన వ్యంగ్య అస్త్రంగా మలచుకుని, పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కేవలం మూడు, నాలుగు రోజుల్లోనే మిలియన్ల కొద్దీ ఫాలోవర్లతో ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వేదికలను ఈ వర్చువల్ పార్టీ షేక్ చేస్తోంది.

నిరుద్యోగ సమస్యలపై కోర్టు విచారణల సందర్భంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్.. ఉద్యోగాలు లేక అలమటిస్తున్న యువతను ఉద్దేశించి బొద్దింకలు అని సంబోధించారంటూ కొన్ని వార్తలు, సోషల్ మీడియా క్లిప్పింగ్స్ బయటకు వచ్చాయి. ఈ వ్యాఖ్యలు దేశంలోని నిరుద్యోగ యువత, విద్యార్థుల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా గాయపరిచాయి. డిగ్రీలు పట్టుకుని ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తున్న మమ్మల్ని బొద్దింకలతో పోలుస్తారా? అంటూ యువ సమాజం తీవ్ర ఆగ్రహానికి గురైంది. అయితే ఈ కోపాన్ని వారు శాంతిభద్రతల సమస్యగా మార్చలేదు.

గతంలో రాజకీయాల్లో తమను తక్కువ చేసి మాట్లాడిన పదాలనే ఉదాహరణకు చాయ్‌వాలా, చౌకీదార్ ఎలాగైతే ఆత్మగౌరవ నినాదాలుగా మార్చుకున్నారో.. అదే వ్యూహాన్ని ఇక్కడ అమలు చేశారు. సరే.. మేము బొద్దింకలమే, మాదే కాక్రొచ్ జనతా పార్టీ అంటూ సరికొత్త వ్యంగ్యాత్మక రాజకీయ పార్టీని డిజిటల్ తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో "నేనూ బొద్దింకనే" అనే హాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. లక్షలాది మంది యువకులు తమ ప్రొఫైల్ పిక్చర్స్ మార్చేస్తూ ఈ డిజిటల్ ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. ఇది కేవలం మీమ్స్‌కు మాత్రమే పరిమితం కాలేదు. ఈ పార్టీకంటూ ఒక అధికారిక వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసి, అందులో డిజిటల్ మెంబర్‌షిప్‌లను కూడా జారీ చేస్తున్నారు. ఊహించని విధంగా కేవలం కొద్దిరోజుల్లోనే లక్షలాది మంది ఈ వెబ్‌సైట్‌లో సభ్యులుగా చేరడం విశేషం.

ఇది నిజమైన ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ కాకపోయినప్పటికీ.. దేశంలోని వ్యవస్థాగత లోపాలను ఎండగట్టడానికి వీరు ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. అందులో ఉన్న అంశాలు పాలకుల తీరుకు అద్దం పడుతూ, ఆలోచింపజేసేలా ఉన్నాయి: సకాలంలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడం.పేపర్ లీకేజీల మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవడం.నిరుద్యోగ భృతి కల్పించడం. యువతకు సరైన ఉపాధి అవకాశాలు చూపించడం. ఈ డిమాండ్లన్నింటినీ అత్యంత వ్యంగ్యంగా, మీమ్స్ , రీల్స్ రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సాంప్రదాయ నిరసనల కంటే ఈ డిజిటల్ పంథా చాలా వేగంగా యువతను ఏకం చేస్తోందని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిరుద్యోగుల గొంతుకగా మారిన ఈ 'కాక్రొచ్ జనతా పార్టీ' సృష్టిస్తున్న డిజిటల్ తుఫాను మున్ముందు ఎలాంటి సామాజిక మార్పులకు కారణమవుతుందో, దీనిపై ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

Tags:    

Similar News