Instagram love: ఫొటోలో ఉన్నది ఒకరు, పెళ్లికొడుకుగా వచ్చింది మరొకరు
Instagram love: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ప్రియుడి కోసం చస్తానంటూ గొడవ చేసి పెళ్లికి సిద్ధమైంది ఒక యువతి.
Instagram love: ఫొటోలో ఉన్నది ఒకరు, పెళ్లికొడుకుగా వచ్చింది మరొకరు
Bride: సోషల్ మీడియా యుగంలో వింత వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రేమలు, పెళ్లిళ్ల విషయంలో ఊహించని ట్విస్టులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ప్రేమ అంటే క్లాస్‌మేట్‌నో, కొలీగ్‌నో లేదా బయట పరిచయమైనవారినో చూసి, ఇష్టపడి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ముక్కు, మొహం తెలియకపోయినా.. సోషల్ మీడియాలో ఒక చిన్న హాయ్‌తో పరిచయం అవ్వడం, చాటింగ్‌లు చేయడం, కొద్దిరోజులకే ప్రేమలో మునిగితేలడం, ఏకంగా పెళ్లి పీటల వరకు వెళ్లడం నిత్యకృత్యమైపోయింది.
అయితే, ఇలాంటి ఆన్‌లైన్ ప్రేమల వల్ల ఎంతటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో కళ్లకు గట్టేలా ఉత్తరప్రదేశ్‌లో ఒక షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ప్రియుడి కోసం చస్తానంటూ గొడవ చేసి పెళ్లికి రెడీ అయిన ఒక యువతి.. తీరా పెళ్లి మండపంలో పెళ్లికొడుకు ముఖం చూసి అరిచి గీపెట్టింది. యూపీలోని హర్దోయ్ ప్రాంతానికి చెందిన ఒక యువతికి ఇన్‌స్టాగ్రామ్‌లో దేవేందర్ సింగ్ పరిమార్ అనే యువకుడితో పరిచయం అయ్యాడు. ఆ చాటింగ్‌లు కాస్తా కొద్దిరోజులకే పీక్స్‌కి చేరి ఘాటు ప్రేమగా మారాయి. ఇద్దరూ ఫొటోలు మార్చుకున్నారు, ఫోన్లలో మాట్లాడుకున్నారు.. కానీ ఒక్కసారి కూడా నేరుగా కలుసుకోలేదు.
ఈ క్రమంలోనే ఆ యువతి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. దాంతో ఆమె ఎదురుతిరిగి, నేను చేసుకుంటే ఇన్‌స్టాలో పరిచయమైన ఆ అబ్బాయినే చేసుకుంటా.. లేదంటే చచ్చిపోతా అంటూ ఇంట్లో వాళ్లను బెదిరించడం మొదలుపెట్టింది. కూతురి ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదనుకున్న ఆ తల్లిదండ్రులు, మనసు చంపుకుని అబ్బాయి తరపు వారితో మాట్లాడి పెళ్లికి అంతా సిద్ధం చేశారు.
పెళ్లి మండపంలో అసలు ట్విస్ట్
బంధుమిత్రుల సందడి, మంగళవాయిద్యాల మధ్య పెళ్లి వేడుక ఘనంగా ప్రారంభమైంది. పెళ్లికొడుకు ముస్తాబై మండపంలోకి అడుగుపెట్టాడు. సాంప్రదాయం ప్రకారం పెళ్లికూతురు కూడా ముస్తాబై స్టేజ్ పైకి వచ్చింది. అంతా సవ్యంగా సాగుతోంది అనుకునే సమయంలో.. పెళ్లికొడుకు ముఖం చూసిన వధువు ఒక్కసారిగా షాక్‌కు గురైంది.
ఇతను నా ప్రియుడు కానే కాదు.. నేను ఈ పెళ్లి చేసుకోను అంటూ అక్కడే గొడవ చేయడం మొదలుపెట్టింది. తాను ఇన్నాళ్లూ రాహుల్ అనే వ్యక్తితో మాట్లాడానని, తనకు పంపిన ఫొటోల్లో ఉన్నది వేరే వ్యక్తి అని, కానీ ఇక్కడికి పెళ్లికొడుకు వేషంలో దేవేందర్ సింగ్ అనే ఈ వ్యక్తి వచ్చాడంటూ పెళ్లిని నిరాకరించింది. అంటే.. ఫిల్టర్లు, ఫేక్ ఫొటోలతో సదరు యువకుడు ఇన్నాళ్లూ ఆ అమ్మాయిని మోసం చేశాడన్నమాట.
పోలీస్ స్టేషన్‌కు మారిన సీన్
ఈ ట్విస్ట్‌తో పెళ్లి మండపం కాస్తా యుద్ధభూమిగా మారింది. మోసపోయామని గ్రహించిన వధువు కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. పెళ్లికొడుకుతో పాటు అతడి తరపు వారిపై దాడి చేసి, చితకబాదారు. ఈ ఘర్షణలో పెళ్లికొడుకు దేవేందర్ సింగ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఎలాగోలా అక్కడ నుంచి తప్పించుకున్న అతడు, నేరుగా పోలీస్ స్టేషన్‌కు పరుగులు తీసి వధువు కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ ఇన్‌స్టా పెళ్లి గోల సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.