Corruption IAS : రిటైర్మెంట్ రోజే ఐఏఎస్ అరెస్ట్.. రూ.169 కోట్ల స్కామ్‌లో..
Corruption IAS : జీవితాంతం ప్రభుత్వ ఉద్యోగం చేసి, రిటైర్మెంట్ రోజున ప్రశాంతంగా ఇంటికెళ్లి మనవడు మనవరాళ్లతో ఆడుకుందాం అనుకున్న ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి..
Corruption IAS
Corruption IAS : జీవితాంతం ప్రభుత్వ ఉద్యోగం చేసి, రిటైర్మెంట్ రోజున ప్రశాంతంగా ఇంటికెళ్లి మనవడు మనవరాళ్లతో ఆడుకుందాం అనుకున్న ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ప్లాన్ రివర్స్ అయింది. హర్యానా స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (HSPCB) మాజీ మెంబర్ సెక్రటరీ, ఐఏఎస్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్‌ను ఆయన ఉద్యోగ విరమణ చేసే రోజే సీబీఐ (CBI) అధికారులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. పర్యావరణ కాలుష్యాన్ని అదుపు చేయాల్సిన బోర్డులో ఉంటూ.. ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ. 169 కోట్ల కాలుష్యం అంటించారనేది ఈయనపై ఉన్న ఆరోపణ.
ఫిక్స్‌డ్ డిపాజిట్ల పేరుతో ‘ఫిక్స్’ చేసేశారు..
ప్రభుత్వ నిధులను జాగ్రత్తగా దాచడంలో ఈ అధికారి చూపించిన శ్రద్ధ అంతా ఇంతా కాదు. చండీగఢ్‌లోని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ శాఖలో ‘ఫిక్స్‌డ్ డిపాజిట్లు’ (FD) చేస్తున్నామంటూ బోర్డుకు చెందిన రూ. 169 కోట్ల నిధులను బదిలీ చేసేశారు. అయితే ట్విస్ట్ ఏంటంటే.. అసలు బ్యాంకులో ఎలాంటి ఎఫ్‌డీలు జరగలేదు! హర్యానా కాలుష్య నియంత్రణ మండలి పేరుతో శాఖా అనుమతులు లేకుండా, ఎలాంటి రికార్డుల్లో ఎక్కించకుండా ఒక దొంగ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఆ అకౌంట్ ద్వారా ప్రభుత్వ సొమ్మును గుట్టుచప్పుడు కాకుండా పక్కదారి పట్టించి, ఎంచక్కా ముంచేశారు. హర్యానా ప్రభుత్వ చరిత్రలోనే ఒక బ్యాంకింగ్ ఫ్రాడ్‌లో ఇంత పెద్ద మొత్తంలో నష్టం జరగడం ఇదే మొదటిసారి అట..
పోలీస్-పబ్లిక్ గేమ్స్.. కోర్టుకు వెళ్లేలోపే కౌంటర్..
ఈ కుంభకోణం బయటపడినప్పటి నుంచి మన ఐఏఎస్ సీబీఐ కంటికి కనబడకుండా తప్పించుకు తిరుగుతున్నారు. నోటీసులు ఇచ్చినా డోంట్ కేర్ అంటూ డిటో మార్చారు. జూలై 2న పంచకుల కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసి, ఎలాగైనా అరెస్ట్ కాకుండా తప్పించుకోవాలని గట్టి ప్లాన్ వేశారు. కానీ, సీబీఐ అంతకంటే స్మార్ట్‌గా ఆలోచించింది. ఆయన కోర్టు మెట్లెక్కే కంటే ముందే.. అదీ సరిగ్గా ఆయన రిటైర్ అయ్యే రోజే లొకేషన్ ట్రేస్ చేసి మరీ లాకప్‌లోకి తోసేసింది.
ఇది ఒక్కడి కథ కాదు.. పెద్ద నెట్‌వర్కే ఉంది..
ఈ రూ. 169 కోట్ల కథ.. కేవలం ఒక చిన్న ట్రైలర్ మాత్రమే. హర్యానాలోని ఎనిమిది ప్రభుత్వ శాఖలకు చెందిన సుమారు రూ. 504 కోట్ల ప్రజాధనాన్ని ఇలాగే దొంగ ఎఫ్‌డీల పేరుతో, షెల్ కంపెనీల ద్వారా నొక్కేసిన పెద్ద నెట్‌వర్క్ ఇది. ఈ భారీ స్కామ్‌లో సీబీఐ ఇప్పటికే ఒక రేంజ్‌లో విరుచుకుపడింది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు చెందిన ఆరుగురు అధికారులు, ముగ్గురు ప్రభుత్వ అధికారులు, ఆరుగురు ప్రైవేట్ వ్యక్తులతో కలిపి మొత్తం 17 మందిపై చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ప్రదీప్ కుమార్ కంటే ముందే ఇద్దరు సీనియర్ ఆఫీసర్లు ఆల్రెడీ జైల్లో చిప్పకూడు తింటున్నారు.
చండీగఢ్ స్మార్ట్ సిటీ, క్రిస్ట్ (CREST) అనే మరో రెండు ప్రభుత్వ విభాగాల్లో కూడా ఇలాంటి ఫ్రాడ్స్ జరిగాయని, అక్కడ ఒక సీనియర్ ఐఎఫ్‌ఓఎస్ (IFoS) అధికారిని కూడా లోపల వేశామని సీబీఐ గర్వంగా చెబుతోంది. ఎంతైనా ప్రభుత్వ సొమ్మును ఎలా ‘స్మార్ట్’గా నొక్కేయాలో ప్లాన్ వేసిన అధికారులకు, రిటైర్మెంట్ రోజున సీబీఐ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ మాత్రం మామూలుగా లేదు కదా..