Gold Treasure : భూమి అమ్మేశాడు.. బంగారం మాత్రం నాదంటున్న మాజీ యజమాని.!

Gold Treasure : పొలంలో పనులు చేసుకుంటున్న కూలీలకు ఒక్కసారిగా అదృష్టం తలుపు తట్టింది. కలుపు తీస్తుండగా ఏకంగా 50 తులాల బంగారం బయటపడింది.

Update: 2026-06-30 06:21 GMT

Gold-warangal

Gold Treasure : పొలంలో పనులు చేసుకుంటున్న కూలీలకు ఒక్కసారిగా అదృష్టం తలుపు తట్టింది. కలుపు తీస్తుండగా ఏకంగా 50 తులాల బంగారం బయటపడింది. అయితే, ఆ నిధిని ఎవరికీ చెప్పకుండా రహస్యంగా పంచుకోవడంతో కథ అడ్డం తిరిగింది. వరంగల్ జిల్లాలో జరిగిన ఈ ఆసక్తికరమైన ఘటన ఇప్పుడు స్థానికంగా పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.

కలుపు తీస్తుంటే దొరికిన లంకె బిందె?

వరంగల్ జిల్లా కోపాకులపాడు గ్రామంలోని ఓ 6 ఎకరాల పొలంలో ఈనెల 24న కూలీలు కలుపు తీస్తున్నారు. ఆ సమయంలో భూమిలో గట్టిగా తగలడంతో తవ్వి చూడగా.. దాదాపు 50 తులాల బంగారం బయటపడింది. దీంతో కూలీలు, పొలం ప్రస్తుత యజమాని కలిసి ఆ బంగారాన్ని ఎవరికీ తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా పంచుకున్నారు. ఈ విషయం కాస్తా బయటకు పొక్కడంతో ఊరంతా గుసగుసలు మొదలయ్యాయి.

నాకు వాటా కావాలంటూ పాత యజమాని ఎంట్రీ..

బంగారం దొరికిన విషయం తెలుసుకున్న సదరు పొలం పాత యజమాని సీన్‌లోకి వచ్చాడు. ఐదేళ్ల క్రితం తానే ఆ భూమిని అమ్మేశానని, కానీ ఆ బంగారం తన పూర్వీకులది అయి ఉంటుందని వాదించడం మొదలుపెట్టాడు. తనకు ఎలాంటి వాటా ఇవ్వకుండా ప్రస్తుత యజమాని, కూలీలు ఆ బంగారాన్ని దొంగతనంగా పంచుకున్నారంటూ ఆయన నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం కాస్తా రచ్చకెక్కింది.

ఒకప్పుడు అక్కడ గుడులు ఉండేవట..

బంగారం దొరికిన ఈ ప్రాంతంలో ఒకప్పుడు పురాతన ఆలయాలు ఉండేవని స్థానికులు చెబుతున్నారు. అందుకే అక్కడ లంకె బిందెలు లేదా పాతకాలపు నాణేలు దొరికే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అస్సలు అక్కడ దొరికింది ఏంటి? దాన్ని ఎవరెవరు పంచుకున్నారు? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.

Tags:    

Similar News