Gokavaram: భూపతిపాలెంలో జాతీయ స్థాయి విద్యా కేంద్రం

Gokavaram: భూపతిపాలెంలో 500 ఎకరాల్లో జాతీయ స్థాయి విద్యా కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Update: 2026-09-02 17:19 GMT

Gokavaram: భూపతిపాలెంలో జాతీయ స్థాయి విద్యా కేంద్రం

గోకవరం: జగ్గంపేట నియోజకవర్గ చరిత్రలో సువర్ణ అధ్యాయానికి నాంది పలికేలా గోకవరం మండలం భూపతిపాలెం రెసిడెన్షియల్ పాఠశాల పరిసరాల్లో ఐదు వందల ఎకరాల విశాల స్థలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో సమీకృత విద్యా కేంద్రం ఏర్పాటు కానుంది.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం కంచి కామకోటి పీఠం నుండి పరిశీలకులుగా విచ్చేసిన విశ్రాంత ఇస్రో శాస్త్రవేత్త ప్రొఫెసర్ మూర్తి, శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతి విశ్వ మహా విద్యాలయం సీఈఓ అరుణ్ సుబ్రహ్మణ్యం ఈరోజు జగ్గంపేట శాసనసభ్యులు, జ్యోతుల నెహ్రూతో కలిసి భూపతిపాలెం ప్రాంతంలో పర్యటించి స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.

అనంతరం ప్రతినిధి బృందం మాట్లాడుతూ ఈ ప్రాంతం చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంతో, పుష్కలంగా నీటి వసతితో, పక్కనే ఏలేరు నది ఉండడంతో విద్యా కేంద్రం ఏర్పాటుకు అత్యంత అనుకూలంగా ఉందని, ఇక్కడ విద్యా కేంద్రం ఏర్పాటు చేస్తే అద్భుతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ మొదట ఈ విద్యా కేంద్రం ఆలోచనను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లానని, ఇది చాలా బాగుందని ఆయన ప్రశంసించినప్పటికీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వెంటనే కార్యరూపం దాల్చడం కష్టమని తెలియజేశారని అన్నారు.

ఆ తర్వాత తిరుపతిలో కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామీజీని దర్శించుకున్న సందర్భంలో ఈ విషయాన్ని వారికి తెలియజేయగా, వారు కంచి వచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వమని తెలియజేయగా మేము వెళ్లి వారికి విషయాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేయడం వారికి ఎంతో నచ్చి వారి ఆలోచన కూడా ఆంధ్రాలో ట్రస్టు ద్వారా విశ్వవిద్యాలయం ఏర్పాటు చెయ్యాలని ఒక కమిటీని వేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ప్రతినిధులను వచ్చి స్థల పరిశీలన చేయడం జరిగిందని అన్నారు.

ఈ విద్యా కేంద్రం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు కేజీ నుండి పీజీ వరకు ఒకే చోట విద్యతో పాటు వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాలల ద్వారా వైద్య సేవలు అందుతాయని, ఇది కేవలం కళాశాలల నిర్మాణం మాత్రమే కాదు, తరతరాల భవిష్యత్తుకు వేసే పునాది అని, వేలాదిమంది ప్రత్యక్షంగా పరోక్షంగా జీవనోపాధి పొందుతారని ఈ ప్రాంతం రాష్ట్రంలోనే ఆదర్శ విద్యా కేంద్రంగా నిలుస్తుందని అన్నారు.

Tags:    

Similar News