Raakh Series : దేశాన్ని షేక్ చేసిన ఆ రియల్ క్రైమ్ కథే.. ఇప్పుడు ‘రాఖ్’గా..!
Raakh Series : టెలివిజన్ , ఓటీటీ ప్రపంచంలో క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌కు ఎప్పుడూ ఉండే క్రేజే వేరు. ముఖ్యంగా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కే సిరీస్‌లపై..
Raakh Series
Raakh Series : టెలివిజన్ , ఓటీటీ ప్రపంచంలో క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌కు ఎప్పుడూ ఉండే క్రేజే వేరు. ముఖ్యంగా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కే సిరీస్‌లపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. తాజాగా అలాంటి ఒక సంచలనాత్మక రియల్ క్రైమ్ ఇన్సిడెంట్ ఆధారంగా బాలీవుడ్ నటులు అలీ ఫజల్, సొనాలి బింద్రే ప్రధాన పాత్రల్లో సరికొత్త ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘రాఖ్’ (Raakh) సిద్ధమైంది. ఈ ఇద్దరు నటీనటులు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే తొలిసారి. ప్రసిద్ధ దర్శకుడు ప్రోసిత్ రాయ్ ఈ సిరీస్‌ను నిర్మించి, దర్శకత్వం వహించగా, సందీప్ సాకేత్ , అనుషా నందకుమార్ దీనికి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ సహ-దర్శకత్వం వహించారు. ఆయుష్ త్రివేది ఈ సిరీస్‌కు పవర్‌ఫుల్ డైలాగ్స్ అందించారు.
స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చు.?
ఈ మోస్ట్ అవేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video) లో జూన్ 12 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల ప్రైమ్ వీడియో సంస్థ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'X' ద్వారా ఈ సిరీస్ అధికారిక పోస్టర్‌ను పంచుకుంటూ ఈ విషయాన్ని ధృవీకరించింది. పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న అలీ ఫజల్, ఒక శవాన్ని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు ఉన్న ఈ పోస్టర్ సిరీస్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోందో చూపిస్తుంది. ‘పూడ్చిపెట్టిన నిజాలు ఎప్పుడూ తమ దారిని వెతుక్కుంటూ బయటకు వస్తాయి’ అనే క్యాప్షన్‌తో రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది.
సంచలనాత్మక ‘రంగా-బిల్లా’ కేసు ఆధారంగా కథ..
ఈ సిరీస్ కథాంశం భారతదేశ చరిత్రలోనే అత్యంత నరరూప రాక్షసులుగా ముద్రపడిన ‘రంగా-బిల్లా’ (కుల్జీత్ అలియాస్ రంగా ఖుష్, జస్బీర్ సింగ్ అలియాస్ బెంగాలీ అలియాస్ బిల్లా) రియల్ లైఫ్ క్రైమ్ కేసు ఆధారంగా రూపొందింది. 1970ల చివరలో ఢిల్లీలో ఇద్దరు టీనేజర్లపై దారుణంగా లైంగిక దాడి చేసి హత్య చేసిన కేసులో వీరికి కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ సిరీస్‌ను కూడా 1970ల నాటి కాలంలోనే సెట్ చేశారు. ఇద్దరు యువకులు అకస్మాత్తుగా అదృశ్యమవడంతో, ఆ కేసును ఛేదించే బాధ్యతను సబ్-ఇన్‌స్పెక్టర్ జయప్రకాష్ (అలీ ఫజల్) అనే అధికారి తీసుకుంటాడు. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ క్రమంలో అతనికి ఎదురైన భయంకరమైన నిజాలు, మానసిక సంఘర్షణల చుట్టూ ఈ కథ నడుస్తుంది.
నటీనటుల పాత్రల వివరాలు
ఇందులో సబ్-ఇన్‌స్పెక్టర్ జయప్రకాష్‌గా అలీ ఫజల్ కనిపించనుండగా, సుదీర్ఘ విరామం తర్వాత సొనాలి బింద్రే ఒక స్కూల్ టీచర్ , అదృశ్యమైన పిల్లల తల్లిగా ఎంతో భావోద్వేగభరితమైన పాత్రలో నటించింది. అలాగే నటుడు అమీర్ బషీర్.. వ్యక్తిగత దుఃఖంలో ఉంటూనే క్రమశిక్షణతో వ్యవహరించే లెఫ్టినెంట్ కల్నల్ అశోక్ అరోరా పాత్రను పోషించారు. వీరితో పాటు ఆకాష్ మఖిజా, రమణ్‌దీప్ యాదవ్, దివ్య శర్మ, వివాన్ శర్మ, అన్షుల్ చౌహాన్, రాకేష్ బేడి , దిబ్యేందు భట్టాచార్య వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
మానవ నైజాన్ని ప్రతిబింబించే సిరీస్
కేవలం ఒక మిస్సింగ్ కేసు, క్రైమ్ థ్రిల్లర్ లాగా మాత్రమే కాకుండా, ఈ సిరీస్ బాధితుల కుటుంబాల వేదన, మానసిక స్థితి, నేరస్థుల ఆలోచనా విధానం, తప్పులు-అపరాధ భావన (Guilt) , పశ్చాత్తాపం వంటి విభిన్న కోణాలను అద్భుతంగా ఆవిష్కరించనుందని చిత్రబృందం తెలిపింది. ప్రైమ్ వీడియో ఇండియా ఒరిజినల్స్ హెడ్ నిఖిల్ మాధోక్ మాట్లాడుతూ.. ఈ సిరీస్‌లో అలీ ఫజల్ అసాధారణమైన నటనను కనబరిచాడని, సిరీస్ ముగిసిన తర్వాత కూడా ఈ కథ ప్రేక్షకుల మనసుల్లో చాలా కాలం పాటు నిలిచిపోతుందని ప్రశంసించారు. మానవ నైజాన్ని అత్యంత నిజాయితీగా, ఉత్కంఠభరితంగా చూపించేందుకు ఈ సిరీస్ ఒక మంచి వేదికైందని దర్శకుడు ప్రోసిత్ రాయ్ ధీమా వ్యక్తం చేశారు.