Ongole: మార్కాపురంలో విద్యాశాఖ అధికారికి ఘన సన్మానం

Ongole: ఒంగోలు డివిజన్ ఉపవిద్యాశాఖ అధికారి అంపేరాయని చంద్ర మౌళీశ్వర్ పదవీ విరమణ సందర్భంగా మార్కాపురంలో ఘన సన్మానం.

Update: 2026-05-14 15:07 GMT

Ongole: మార్కాపురంలో విద్యాశాఖ అధికారికి ఘన సన్మానం

Ongole: మార్కాపురం జిల్లా మార్కాపురంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఓంగోలు డివిజన్ ఉపవిద్యాశాఖ అధికారి అంపేరాయని చంద్ర మౌళీశ్వర్ పదవీ విరమణ సందర్భంగా ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మార్కాపురం జిల్లా మండల విద్యాశాఖాధికారులు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సంయుక్తంగా పాల్గొన్నారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మార్కాపురం డివిజనల్ ఉపవిద్యాశాఖ అధికారి ఎం. శ్రీనివాసులు మాట్లాడుతూ అంపేరాయని చంద్ర మౌళీశ్వర్ ఉపాధ్యాయునిగా సేవలను ప్రారంభించి, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు. అనంతరం మండల విద్యాశాఖాధికారి, ఉపవిద్యాశాఖాధికారిగా వివిధ హోదాల్లో విశిష్ట సేవలు అందించి అందరి ఆదరాభిమానాలు పొందారని తెలిపారు. సమాజ నిర్మాణంలో ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు.

సన్మాన గ్రహీత అంపేరాయని చంద్ర మౌళీశ్వర్ మాట్లాడుతూ తన ఉద్యోగ జీవితంలో మార్కాపురం డివిజన్ ప్రత్యేక గుర్తింపు, సంతృప్తిని ఇచ్చిందన్నారు. ఇక్కడి ప్రజలు, ఉపాధ్యాయులు ఎంతో సహృదయంతో, బాధ్యతతో పనిచేస్తారని పేర్కొన్నారు. తన సేవాకాలంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విశ్రాంత ఉపవిద్యాశాఖ అధికారి అంపేరాయని చంద్ర మౌళీశ్వర్ దంపతులను దుశ్శాలువలు, జ్ఞాపికలతో వివిధ సంఘాల ప్రతినిధులు, నాయకులు ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపవిద్యాశాఖ అధికారి వై.ఎ. అమరేశ్వర్, స్థానిక మండల విద్యాశాఖాధికారి బి. రాందాస్ నాయక్, మండల విద్యాశాఖాధికారుల సంఘం అధ్యక్షులు డి. రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి వి. గిరిధర్ శర్మ, ప్రధానోపాధ్యాయుల సంఘ నాయకులు ముత్తోజు సుధాకర్, ఎం. విజయభాస్కర్ రెడ్డి, వేమూరి పిచ్చిరావు, ఉపాధ్యాయ సంఘ నాయకులు ఓ.వి. వీరారెడ్డి, కె. ఎర్రయ్య, వెన్న వెంకటరెడ్డి, ఎం. రవిచంద్ర, జి.ఎల్. రమేష్, సంజీవ్, ఎన్జీవో నాయకులు రమేష్ రెడ్డి, సంజయ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా పరిధిలోని అన్ని మండలాల మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags:    

Similar News