Neha Pachisia: ఒకప్పుడు లేడీ సింగం..కట్ చేస్తే ఇప్పుడు పెద్ద క్రిమినల్!

Neha Pachisia: మధ్యప్రదేశ్ 'లేడీ సింగం'గా పేరుపొందిన మాజీ సీఎస్పీ నేహా పచిసియాపై తీవ్ర నేరారోపణలతో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

Update: 2026-08-23 07:43 GMT

Neha Pachisia: ఒకప్పుడు లేడీ సింగం..కట్ చేస్తే ఇప్పుడు పెద్ద క్రిమినల్!

Neha Pachisia: ఒకప్పుడు సమాజంలో అన్యాయంపై ఉక్కుపాదం మోపుతూ లేడీ సింగంగా జనం నీరాజనాలు పట్టిన ఆ మహిళా అధికారిణి, నేడు నేరస్థులకు కొమ్ముకాస్తూ పోలీస్ శాఖకే మచ్చతెచ్చిన నిందితురాలిగా బోనులో నిలబడింది. మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తున్న కట్నీ మాజీ సీఎస్పీ నేహా పచిసియా (37) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.

విధి నిర్వహణలో కఠినంగా ఉంటారని పేరు తెచ్చుకున్న నేహా పచిసియా, ఓ దారుణమైన హత్య కేసు నిందితుడు రమేష్ లోధితో చేసిన లాలూచీ ఆమె అసలు రంగును బయటపెట్టింది.

హత్య కేసు నిందితుడిని అరెస్టు చేసినప్పటికీ, సీఎస్పీ హోదాలో ఉన్న నేహా కావాలనే 90 రోజుల పాటు ఛార్జిషీట్ దాఖలు చేయకుండా ఆలస్యం చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో నిందితుడికి కోర్టు నుంచి 'డిఫాల్ట్ బెయిల్' లభించింది. రూ. 2 కోట్ల భూమి.. కేవలం 18 లక్షలకే. అసలు కథ ఇక్కడే మొదలైంది. ప్రభుత్వ ధర ప్రకారం రూ. 82 లక్షలు, మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ. 2 కోట్లు పలికే నిందితుడి భూమిని, ఒత్తిడి తీసుకువచ్చి కేవలం రూ. 18 లక్షలకే మార్కస్ అహ్మద్ హనాఫీ అనే వ్యక్తికి విక్రయించేలా ఆమె చక్రం తిప్పారు.

ఈ అక్రమాలు కట్నీ ఎస్పీ అభినయ్ విశ్వకర్మ దృష్టికి రావడంతో ప్రాథమిక విచారణ జరిపి నివేదిక సమర్పించారు. విషయం ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ వరకు వెళ్లడంతో, ఆయన ఆదేశాల మేరకు నేహా పచిసియాను తక్షణమే సస్పెండ్ చేశారు.

ఆగస్టు 19న కట్నీలోని కుత్లా పోలీస్ స్టేషన్‌లో నేహాతో పాటు మరో ఇద్దరు పోలీసులపై తీవ్రమైన సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ కేసు దర్యాప్తును జబల్‌పూర్ జోన్ ఐజీ ప్రమోద్ వర్మ పర్యవేక్షణలో అదనపు ఎస్పీ అంజనా తివారీ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించారు. సేవా నిబంధనలు ఉల్లంఘించిన మరో ఆరుగురు సిబ్బందిపైనా చర్యలు తీసుకున్నారు.

రాజ్‌గఢ్ జిల్లాకు చెందిన నేహా పచిసియా ప్రస్థానం ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఉండేది. ఎయిర్ హోస్టెస్‌గా, కొన్ని బహుళజాతి సంస్థల్లో ఉద్యోగం చేసిన ఆమె, 2012లో MPPSC సాధించి పోలీస్ శాఖలోకి వచ్చారు. గుణాలో పనిచేస్తున్నప్పుడు మహిళల రక్షణ కోసం 'మొబైల్ పోలీస్ స్టేషన్' ప్రారంభించి 'లేడీ సింగం'గా పేరుపొందారు.

అయితే, అధికారం తలకు ఎక్కడంతో ఆమె దారి తప్పారు. ఓ రవాణాదారుడి డంపర్ ట్రక్కును ఆపి అక్రమంగా డబ్బులు వసూలు చేశారనే మరో శాఖాపరమైన విచారణ కూడా ఆమెపై నడుస్తోంది. ఐఏఎస్ కావాలన్న ఆశయంతో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరిన ఒక డైనమిక్ ఆఫీసర్, నేడు క్రిమినల్ కేసుల్లో ఎస్ఐటీ విచారణ ఎదుర్కొనే స్థాయికి దిగజారడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News