Supreme Court: 'మీ పేరు ముందు డాక్టర్‌ను తీసెయ్యండి'.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
Supreme Court: గాజియాబాద్‌లో అత్యాచారానికి గురైన నాలుగేళ్ల చిన్నారి మృతిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Supreme Court: 'మీ పేరు ముందు డాక్టర్‌ను తీసెయ్యండి'.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
Supreme Court: అత్యాచారానికి గురైన నాలుగేళ్ల అమాయక చిన్నారికి సకాలంలో సరైన అత్యవసర వైద్యం అందించకపోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయిన అత్యంత హృదయవిదారక ఘటనపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితురాలి పట్ల మానవత్వం లేకుండా వ్యవహరించిన వైద్యులను, చట్టాన్ని నిర్లక్ష్యం చేసిన పోలీసులను కోర్టు ఘాటు పదజాలంతో మందలించింది. "సరిగ్గా విధి నిర్వహించనప్పుడు పేరుకు ముందు 'డాక్టర్' అనే పదాన్ని రాసుకునే హక్కు ఆ వైద్యులకు లేదు" అని ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో చోటుచేసుకుంది. మార్చి 16న ఇంటి వద్ద ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారికి చాక్లెట్లు కొనిస్తానని ఆశచూపి ఓ దుర్మార్గుడు తీసుకెళ్లాడు. ఆపై ఆ చిన్నారిపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో పడి ఉన్న చిన్నారిని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే రక్షణ కోసం రెండు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు.
అయితే ఆ ఆసుపత్రుల వైద్యులు చిన్నారిని చేర్చుకోవడానికి, ప్రాథమిక చికిత్స అందించడానికి నిరాకరించారు. ఆ తర్వాత చిన్నారిని గాజియాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అత్యాచారం జరిగిన తర్వాత కూడా చిన్నారి రెండు గంటలకు పైగా బతికే ఉందని, సకాలంలో వైద్యం అందించి ఉంటే ఆ బిడ్డ ప్రాణాలు దక్కేవని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
బాధిత కుటుంబం అత్యంత పేద కుటుంబం కావడం, ఆసుపత్రి ఫీజులు భరించలేరనే కారణంతోనే చిన్నారి ప్రాణాలను ప్రైవేట్ వైద్యులు నిర్లక్ష్యం చేశారని సుప్రీంకోర్టు మండిపడింది. కనీసం దయ ఉండి ఉంటే.. తమ వద్ద సదుపాయాలు లేనప్పుడు మరో ఆసుపత్రికి పంపే ఏర్పాట్లు చేయాల్సింది పోయి చేర్చుకోకపోవడం నేరమని పేర్కొంది.
ఈ ఘటనపై విచారణకు సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) నియమించింది. సిట్ విచారణలో పోలీసులు, వైద్యులు తీవ్రంగా నిర్లక్ష్యం వహించినట్లు స్పష్టమైంది. చిన్నారి పరిస్థితిపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన కుటుంబసభ్యులపైనే పోలీసులు ఎదురుదాడికి దిగారని, నిరసనలు చేసిన తర్వాతే మరుసటి రోజు కేసు నమోదు చేశారని తేలింది. నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేయకపోవడంపై పోలీసులను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది.
చిన్నారికి సకాలంలో వైద్యం అందించని ఆ రెండు ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులకు శిక్షగా.. మృతురాలి కుటుంబానికి స్వచ్ఛందంగా భారీగా ఆర్థిక విరాళాలు (పరిహారం) ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.