Heavy Rains: హమ్మయ్య.. వాన దేవుడు వచ్చేశాడు.. ఈ జిల్లాలో భారీ వర్షాలు
Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
Heavy Rains: హమ్మయ్య.. వాన దేవుడు వచ్చేశాడు.. ఈ జిల్లాలో భారీ వర్షాలు
IMD: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భానుడి భగభగలకు ఉపశమనం కలిగిస్తూ వరుణ దేవుడు కరుణించినా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆ వానలు కాస్తా ముంచెత్తే వర్షాలుగా మారాయి. గురువారం అర్ధరాత్రి నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది.
నిద్రపోతున్న వేళ ఒక్కసారిగా ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు వానలు దంచికొట్టాయి. ముఖ్యంగా..సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్, కంది, సదాశివపేట పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. నిజామాబాద్ పరిధిలోని సాలూరతో పాటు కామారెడ్డి, నిజాంసాగర్ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో భారీ నుంచి అతి భారీ వర్షం నమోదైంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం.. ఇవాళ ఉదయం 9 గంటల తర్వాత కూడా వర్షాల ప్రభావం బలంగా ఉండనుంది. ఈ క్రింది జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన స్పష్టమైన అల్పపీడనం, దానికి తోడు ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోనూ వాతావరణం చల్లబడింది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, అనంతపురం జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. అయితే, వర్షంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.