Sonam Wangchuk: దీక్ష విరమణకు సోనమ్ వాంగ్‌చుక్ 3 షరతులు!

Sonam Wangchuk: విద్యా వ్యవస్థలో వైఫల్యాలు, నీట్ పేపర్ లీకేజీపై 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ తన దీక్ష విరమణకు మూడు షరతులు పెట్టారు.

Update: 2026-07-20 05:22 GMT

Sonam Wangchuk: దీక్ష విరమణకు సోనమ్ వాంగ్‌చుక్ 3 షరతులు!

Sonam Wangchuk: దేశ విద్యా వ్యవస్థలో వైఫల్యాలకు నిరసనగా గత 20 రోజులకు పైగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్ సంచలన లేఖ విడుదల చేశారు. దిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో తనను అక్రమంగా నిర్బంధించారని ఆరోపించిన ఆయన.. తన దీక్షను ముగించేందుకు కేంద్ర ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు మూడు ప్రధాన షరతులు విధించారు. ఈ డిమాండ్లను నెరవేరిస్తే సోమవారమే దీక్ష విరమిస్తానని స్పష్టం చేశారు.

వాంగ్‌చుక్ పెట్టిన ఆ మూడు షరతులు ఇవే:

దేశ విద్యా వ్యవస్థలో వైఫల్యాలతో పాటు, ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) ప్రశ్నపత్రం లీకేజీ ఘటనకు కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి.

నీట్ పేపర్ లీక్ అంశాన్ని రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో బలంగా లేవనెత్తుతామని దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు స్పష్టమైన హామీ ఇవ్వాలి.

ప్రస్తుతం క్షీణిస్తున్న తన ఆరోగ్య పరిస్థితి కారణంగా ఒకవేళ తాను పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొనలేకపోతే, అగ్ర రాజకీయ నాయకులే స్వయంగా ఆసుపత్రికి వచ్చి పైన పేర్కొన్న రెండు అంశాలపై తనకు వ్యక్తిగతంగా హామీ ఇవ్వాలి.

మరోవైపు, ఆసుపత్రిలో ఉన్న వాంగ్‌చుక్‌ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో ఆదివారం దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ విజ్ఞప్తిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ ఆయన స్వచ్ఛందంగా ఆసుపత్రిలో చేరకపోవడంతో, ఆయన ప్రాణాలను కాపాడేందుకు బలవంతంగానైనా ఆసుపత్రికి తరలించే అధికారం ప్రభుత్వానికి ఉందని కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, వాంగ్‌చుక్‌ సమ్మతితోనే చికిత్స అందిస్తున్నారని న్యాయమూర్తి వెల్లడించారు.

Tags:    

Similar News