PM Modi: ‘ఆ 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడట్లేదు’.. రాహుల్ గాంధీపై మోదీ పరోక్ష చురకలు!
PM Modi: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం వేళ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
PM Modi: ‘ఆ 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడట్లేదు’.. రాహుల్ గాంధీపై మోదీ పరోక్ష చురకలు!
PM Modi: పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సభలు సజావుగా సాగాలని ఆకాంక్షించిన ఆయన.. ఇదే సమయంలో అంతరిక్ష రంగంలో భారత యువత సాధిస్తున్న విజయాలను కొనియాడారు. విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఉద్దేశించి పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
"వర్షాకాలం, వర్షాకాల సమావేశాలు.. ఈ రెండు చురుగ్గా ఉంటే ఫలితాలు గొప్పగా ఉంటాయి. అప్పుడే దేశం సుభిక్షంగా, సంక్షేమంగా ఉంటుంది. అందుకే ఈ రెండూ మెరుగ్గా ఉండాలని నేను బలంగా కోరుకుంటున్నాను" అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. గందరగోళ పరిస్థితులకు తావులేకుండా పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రజా సమస్యలపై అర్ధవంతమైన చర్చలు జరగాలని ఆయన పిలుపునిచ్చారు.
భారతీయ అంతరిక్ష రంగ స్టార్టప్ స్కైరూట్ 'విక్రమ్-1' ప్రయోగం విజయవంతం అవడంపై ప్రధాని మోదీ తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. కేవలం 28 ఏళ్ల సగటు వయసున్న యువ ఆవిష్కర్తలే ఈ అద్భుత ఘనత సాధించారని కొనియాడారు. గత ఏడాది వర్షాకాల సమావేశాలకు ముందు భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోగా, ఇప్పుడు ఒక భారతీయ ప్రైవేట్ స్టార్టప్ అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తోందని మోదీ గుర్తుచేశారు. యువత సామర్థ్యం, ఆకాంక్షలు అంతరిక్షం వలే హద్దుల్లేనివని ప్రశంసించారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రధాని మోదీ పరోక్షంగా చురకలంటించారు. "భారత యువత అంతరిక్షంలో ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మాత్రమే ఇలాంటి ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. స్కైరూట్ స్టార్టప్ బృందం సగటు వయసు 28 ఏళ్లని నాకు తెలిసింది. ఇక్కడ నేను 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడటం లేదు" అంటూ మోదీ వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.