PNB Account Alert: పీఎన్‌బీ ఖాతాదారులకు హెచ్చరిక.. ఏప్రిల్ 15 లోపు మీ అకౌంట్ క్లోజ్ ప్రమాదం!
PNB Account Alert: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ఖాతాదారులకు ముఖ్య గమనిక. గత మూడు ఏళ్లుగా లావాదేవీలు లేని, జీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతాలను ఏప్రిల్ 15, 2026 తర్వాత మూసివేయాలని బ్యాంక్ నిర్ణయించింది.
PNB Account Alert: మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో ఖాతా కలిగి ఉన్నారా.. అయితే ఈ వార్త మీకోసమే. గత మూడు సంవత్సరాలుగా ఎటువంటి లావాదేవీలు జరపని ఇన్ యాక్టివేట్ (Inactive) ఖాతాల విషయంలో బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. అటువంటి ఖాతాదారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే, ఏప్రిల్ 15, 2026 తర్వాత ఆ ఖాతాలను శాశ్వతంగా మూసివేస్తామని బ్యాంక్ హెచ్చరించింది.
ఎవరి ఖాతాలు మూసివేస్తారు..
బ్యాంక్ వెల్లడించిన అధికారిక ప్రకటన ప్రకారం.. ఈ నిబంధన అందరికీ వర్తించదు. కేవలం కింద పేర్కొన్న పరిస్థితుల్లో ఉన్న ఖాతాలకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది.
* గత మూడు సంవత్సరాలుగా ఖాతాలో ఎటువంటి లావాదేవీలు జరగని వారు.
* ఖాతాలో బ్యాలెన్స్ సున్నా (Zero Balance) ఉన్న వారు.
* ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా (X - గతంలో ట్విట్టర్) బ్యాంక్ తన ఖాతాదారులను అప్రమత్తం చేసింది.
ఖాతాను కాపాడుకోవడం ఎలా అంటే..
మీ ఖాతా మూతపడకుండా ఉండాలంటే ఏప్రిల్ 15వ తేదీ లోపు ఈ పనులు చేయాలని చెబుతున్నారు. ముందుగా మీరు మీకు సమీపంలోని పీఎన్‌బీ బ్రాంచ్‌ను సందర్శించి మీ 'నో యువర్ కస్టమర్' (KYC) ప్రక్రియను పూర్తి చేయాలి. ఆ తర్వాత కనీసం ఒక చిన్న లావాదేవీ (డబ్బు జమ చేయడం లేదా విత్‌డ్రా చేయడం) ద్వారా ఖాతాను తిరిగి యాక్టివేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ గడువులోగా స్పందించకపోతే, ఏప్రిల్ 16 నుంచి ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే ఖాతా రద్దవుతుందని బ్యాంక్ స్పష్టం చేసింది. ఇన్ యాక్టివేట్ ఖాతాల ద్వారా సైబర్ నేరాలు, బ్యాంకింగ్ మోసాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని బ్యాంక్ భావిస్తోంది. ఈ ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా బ్యాంక్ ఈ చర్య చేపట్టినట్లు పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం కాలానుగుణంగా కేవైసీ అప్‌డేట్ చేయడం తప్పనిసరి.