Ayodhya: అయోధ్యలో శ్రీ రామ్ యంత్రాన్ని ప్రతిష్టించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Ayodhya: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయోధ్యలో పర్యటించారు. ఈ సందర్భంగా అయోధ్యలో రామ్ లల్లాను దర్శించుకున్నారు. రామమందిరం శ్రీరామ్ యంత్రాన్ని ప్రతిష్టించారు.

Update: 2026-03-19 10:04 GMT

Ayodhya

Ayodhya: నవరాత్రుల మొదటి రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయోధ్యలోని రామ మందిరానికి చేరుకున్నారు. అక్కడ ఆమె రామ్ లల్లాను దర్శించుకుని, రెండవ అంతస్తులోని రామ్ దర్బార్‌లో శ్రీ రామ్ యంత్రాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఆమె రామ మందిర ప్రాంగణమంతా పరిశీలించారు. ఆమె వెంట ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ కూడా ఉన్నారు. ఆలయ నిర్మాణ పనులకు సంబంధించిన వివరాలను ఆయన రాష్ట్రపతికి వివరించారు. రాష్ట్రపతి ఉదయం సుమారు 10:30 గంటలకు ఢిల్లీ నుంచి అయోధ్య విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆమెకు స్వాగతం పలికారు.

రామ్ లల్లా ప్రతిష్ఠాపన తర్వాత రాష్ట్రపతి అయోధ్యలో పర్యటించడం ఇది రెండోసారి. ఆమె గతంలో 2024 మే 1న అయోధ్యను సందర్శించి, అక్కడ హనుమాన్‌గఢి, రామ మందిరాన్ని దర్శించారు. అయోధ్యలో సుమారు ఐదు గంటలు గడిపిన అనంతరం, రాష్ట్రపతి మధ్యాహ్నం 3 గంటలకు మధురకు బయలుదేరి వెళ్లారు.

రాష్ట్రపతి ప్రతిష్టించిన శ్రీరామ్ యంత్రం ఏమిటి?

తమిళనాడులోని కాంచీపురంలో ఒక మఠంలో ఈ రామ యంత్రాన్ని తయారు చేశారు. ఆ తర్వాత దానిని అక్కడ నుంచి తిరుపతికి తీసుకువచ్చారు. అనంతరం 10 రోజుల క్రితం రథయాత్ర ద్వారా దానిని అయోధ్యకు తరలించారు. రామ యంత్రం బరువు 150 కిలోగ్రాములు. దీనికి బంగారు పూత పూశారు. అయోధ్యలోని పండితులు చెప్పినదాని ప్రకారం..

రామ యంత్రం ఒక ప్రత్యేకమైన వైదిక జ్యామితీయ నిర్మాణం. ఇది మంత్రాలు, చిహ్నాల ద్వారా శ్రీరాముని .. ఇతర దేవతల దైవిక శక్తిని నిక్షిప్తం చేస్తుంది. దీనిని అత్యంత పవిత్రమైనదిగా, ఆధ్యాత్మిక శక్తికి చిహ్నంగా పరిగణిస్తారు.

రామ జన్మభూమిపై అడుగుపెట్టడం ఒక అదృష్టం..

అయోధ్యలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ "శ్రీరాముడు అయోధ్యలో జన్మించారు. ఈ పవిత్ర భూమిపై అడుగుపెట్టడం నాకు దక్కిన ఒక గొప్ప అవకాశం. శ్రీరాముడు తన జన్మస్థలాన్ని స్వర్గం కంటే గొప్పదిగా వర్ణించారు. అయోధ్య నగరం రామ భక్తులందరికీ కూడా అత్యంత ప్రియమైనది." అన్నారు.

రామాయణంలో తులసీదాస్ ఊహించిన విధంగా దేశం రామరాజ్యం దిశగా ముందుకు సాగుతోందాని రాష్ట్రపతి అన్నారు. శ్రీ భగవానుడి ఆశీస్సులతో రామ మందిరానికి ఆదరణ పెరుగుతోంది. మన దేశ ప్రజలందరిపై భగవంతుడు తన ఆశీస్సులను కొనసాగించాలని నేను ప్రార్థిస్తున్నాను అని ఆమె పేర్కొన్నారు.

Tags:    

Similar News