HDFC బ్యాంక్ షేర్ల భారీ పతనం.. నిమిషాల్లో రూ.1 లక్ష కోట్లు ఆవిరి!
"హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో ప్రకంపనలు.. ఛైర్మన్ అటాను చక్రవర్తి ఆకస్మిక రాజీనామాతో నిమిషాల్లో రూ.1 లక్ష కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి అయ్యింది. 2020 కోవిడ్ సంక్షోభం తర్వాత ఇదే అతిపెద్ద పతనం అని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. అసలు బ్యాంకులో ఏం జరుగుతోంది? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చదవండి".
HDFC బ్యాంక్ షేర్ల భారీ పతనం.. నిమిషాల్లో రూ.1 లక్ష కోట్లు ఆవిరి!
HDFC Bank :దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ గురువారం ట్రేడింగ్‌లో కోలుకోలేని దెబ్బతింది. మార్కెట్ ప్రారంభమైన కొద్దిసేపటికే బ్యాంక్ షేర్లు దాదాపు 9 శాతం పడిపోయాయి. ఈ ఆకస్మిక అమ్మకాల ఒత్తిడి వల్ల కేవలం నిమిషాల వ్యవధిలోనే బ్యాంక్ మార్కెట్ విలువలో రూ.1 లక్ష కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి. బ్యాంక్ పార్ట్‌టైమ్ ఛైర్మన్, స్వతంత్ర డైరెక్టర్ అటాను చక్రవర్తి తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేయడం ఈ పతనానికి ప్రధాన కారణమైందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కేవలం రాజీనామా చేయడమే కాకుండా, ఆయన పేర్కొన్న కారణాలు మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేశాయి. గత రెండేళ్లుగా బ్యాంకులో జరుగుతున్న కొన్ని పద్ధతులు తన వ్యక్తిగత విలువలు, నైతికతకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన ఈ లేఖలో పేర్కొనడం ఇన్వెస్టర్లలో అనుమానాలను రేకెత్తించింది.
తాత్కాలిక ఛైర్మన్ నియామకం..
ఈ పరిణామంతో బ్యాంకులో అంతర్గత విభేదాలు లేదా అధికార పోరాటం జరుగుతోందా? అనే ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై బ్యాంక్ యాజమాన్యం వెంటనే స్పందిస్తూ.. అటాను చక్రవర్తి లేఖలో పేర్కొన్నవి తప్ప వేరే రహస్య కారణాలేవీ లేవని స్పష్టం చేసింది. ఆర్‌బిఐ (RBI) ఆమోదంతో కేకి మిస్త్రీని రాబోయే మూడు నెలల పాటు తాత్కాలిక (పార్ట్-టైమ్) ఛైర్మన్‌గా నియమించారు. బ్యాంకులో ఎలాంటి అంతర్గత కలహాలు లేవని, బోర్డు సభ్యుల మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తల్లో నిజం లేదని మిస్త్రీ స్పష్టం చేశారు. 2020 మార్చి 23న కోవిడ్ సంక్షోభం సమయంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు 13 శాతం పడిపోయాయి. ఆ తర్వాత మళ్లీ అంతటి స్థాయిలో కుప్పకూలడం ఇదే మొదటిసారి. గురువారం ఉదయం మార్కెట్ క్యాప్ రూ.11.85 లక్షల కోట్లకు పడిపోయినప్పటికీ, ఆ తర్వాత స్టాక్ స్వల్పంగా కోలుకుని 5 శాతం నష్టంతో ట్రేడవుతోంది.