Madhya Pradesh: జలపాతంలో స్నానం.. పది రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో విషాదం. జలపాతంలో స్నానం చేసిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బాలురు అంతుచిక్కని అనారోగ్యంతో మృతి.

Update: 2026-09-03 06:02 GMT

Madhya Pradesh: జలపాతంలో స్నానం.. పది రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో అత్యంత విషాదకర ఘటన వెలుగు చూసింది. పిక్నిక్‌కు వెళ్లి సరదాగా గడిపిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు, పది రోజుల వ్యవధిలో ఒకరి తర్వాత మరొకరు మృత్యువాత పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. జలపాతంలో స్నానం చేసిన తర్వాత అంతుచిక్కని అనారోగ్యంతో వారు ప్రాణాలు కోల్పోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

ఫిజికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే తన్వీర్ అహ్మద్ కుటుంబ సభ్యులు, వారి బంధువులు కలిసి గత నెల ఆగస్టు 16న స్థానికంగా ఉన్న గోరా టిలా జలపాతం వద్దకు పిక్నిక్‌కు వెళ్లారు. ఈ బృందంలోని దాదాపు 15 నుంచి 16 మంది జలపాతంలో స్నానాలు చేసి ఇంటికి తిరిగివచ్చారు. అయితే, వచ్చిన కొద్దిసేపటికే వారిలో చాలామంది జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాల వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నలుగురు బాలురు పరిస్థితి వేగంగా విషమించింది.

ఈ అస్వస్థతకు గురైన వారిలో తన్వీర్ అహ్మద్ కుమారులు తాహిర్ (14), తసిఫ్ (11), తారూఫ్ (9)తో పాటు వారి బంధువు రజా మహమ్మద్ కుమారుడు అయాజ్ (19) ఉన్నారు. ఆగస్టు 18న అనారోగ్యం పాలైన తాహిర్‌ను శివపురి, గ్వాలియర్ ఆసుపత్రుల్లో చేర్పించి మెరుగైన వైద్యం అందించినా ఫలితం దక్కలేదు. ఆ తర్వాత ఆగస్టు 21 నుంచి 31 మధ్య మిగిలిన ముగ్గురు కూడా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇదే కుటుంబానికి చెందిన మరో ముగ్గురు బాలికలు కూడా అస్వస్థతకు గురికావడంతో వారిని మెరుగైన చికిత్స నిమిత్తం గ్వాలియర్‌కు తరలించారు.

జలపాతంలోని నీరు కలుషితం కావడం వల్లే ఈ దుర్ఘటన జరిగి ఉంటుందని కుటుంబ సభ్యులు, స్థానికులు అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంజయ్ రిషిశ్వర్ నేతృత్వంలోని వైద్య ఆరోగ్య శాఖ బృందం బాధిత కుటుంబాన్ని పరామర్శించింది. ఆ ప్రాంతంలోని సుమారు 50 నుంచి 60 మంది గ్రామస్తుల రక్త నమూనాలతో పాటు, జలపాతం నీటి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ప్రాథమిక పరీక్షల్లో బాధితుల రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోవడం, కాలేయ (లివర్) సంబంధిత సమస్యలు తలెత్తినట్లు వైద్యులు గుర్తించారు.

పూర్తిస్థాయి ల్యాబ్ రిపోర్టులు వస్తేనే మరణాలకు అసలు కారణం ఏమిటనేది స్పష్టమవుతుందని అధికారులు తెలిపారు. విచారణ పూర్తయ్యే వరకు ఎవరూ ఆ జలపాతం నీటిని వాడొద్దని హెచ్చరించారు. ఈ దారుణ ఘటనపై స్పందించిన ప్రభుత్వం బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేసింది.

Tags:    

Similar News