Tamil Nadu: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. రైతులు, ఉపాధ్యాయులపై కేసులు ఎత్తివేత!
Tamil Nadu: తమిళనాడులో రైతులు, ఉపాధ్యాయులపై గత ప్రభుత్వ హయాంలో నమోదైన కేసులను ఎత్తివేస్తున్నట్లు సీఎం విజయ్ ప్రకటించారు.
Tamil Nadu: తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వంపై ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. గత పాలనలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపిన రైతులు, ఉపాధ్యాయులపై పెట్టిన కేసులను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా సంచలన ప్రకటన చేశారు.
మే 2021 నుంచి 2026 మధ్య కాలంలో సిప్కాట్ (SIPCOT) పారిశ్రామిక అభివృద్ధి, పరందూర్ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రైతులు, ఉపాధ్యాయులపై అనేక కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉండటంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎం విజయ్ తెలిపారు. సామాన్య ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం పెంపొందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
నీట్ (NEET) పరీక్షకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థులు, ఆందోళనకారులపై ఉన్న కేసులను కూడా ఉపసంహరించుకోవాలని సీపీఐ పార్టీ కోరగా, నెయ్వేలి లిగ్నైట్ కార్పొరేషన్ (NLC) వ్యతిరేక ఆందోళన కేసులను వెనక్కి తీసుకోవాలని పీఎంకే విజ్ఞప్తి చేసింది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక స్పందన రావాల్సి ఉంది.