భార్యలు కనిపించడం లేదంటూ ఫిర్యాదు.. పోలీసుల విచారణలో బయటపడ్డ ఇద్దరు అన్నదమ్ముల దారుణం!

Jharkhand: కుటుంబంలో తలెత్తిన చిన్నపాటి మనస్పర్థలు ఇద్దరు వివాహిత మహిళల ప్రాణాలను బలిగొన్నాయి. కట్టుకున్న భార్యలను అత్యంత కిరాతకంగా హత్య చేసి, అంబులెన్స్‌లో తీసుకెళ్లి పక్క జిల్లాలోని అడవిలో పాతిపెట్టిన అన్నదమ్ముల దారుణ ఘటన జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో వెలుగులోకి వచ్చింది. భార్యలు కనిపించడం లేదంటూ నిందితులు ఆడిన మిస్సింగ్ నాటకాన్ని ఐదేళ్ల చిన్నారి సాక్ష్యంతో పోలీసులు ఛేదించారు.

గుమ్లా జిల్లాకు చెందిన సమేశ్వర్ సాహు, టిలేశ్వరి దేవి దంపతులకు శివశంకర్ సాహు, నవీన్ సాహు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో ఒకరు అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు వీరిద్దరికీ మినీ ప్రియ (28), రాధికా కుమారి (20) అనే యువతులతో వివాహం జరిపించారు.

పెళ్లయిన కొద్దిరోజులకే కుటుంబంలో చిన్నపాటి గొడవలు మొదలయ్యాయి. దీంతో ఇద్దరు భార్యలు అత్తింటి నుంచి పుట్టింటికి వెళ్లిపోయారు. అనంతరం గ్రామ పంచాయతీ పెద్దలు జోక్యం చేసుకుని రాజీ కుదర్చడంతో వారు తిరిగి భర్తల వద్దకు వచ్చారు. అయితే, అత్తింటికి వచ్చిన తర్వాత మళ్లీ ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.

కోపంతో ఊగిపోయిన శివశంకర్, నవీన్ సాహులు తమ భార్యలను గొడ్డలితో నరికి అత్యంత దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆధారాలు దొరకకుండా మృతదేహాలను అంబులెన్స్‌లో పొరుగు జిల్లా సిమ్డేగాలోని ఓ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పూడ్చిపెట్టారు.

హత్యల తర్వాత ఏమీ తెలియనట్లు నటించిన అన్నదమ్ములు, మంగళవారం తమ భార్యలు చెప్పకుండా ఎటో వెళ్లిపోయారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇంట్లో జరిగిన దారుణాన్ని ఇరుగుపొరుగుకు చెందిన ఓ 5 ఏళ్ల చిన్నారి చూసి పెద్దలకు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. అనుమానంతో నిందితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, భార్యలను చంపి సిమ్డేగా అడవిలో పాతిపెట్టినట్లు నిందితులు నేరం అంగీకరించారు.

నిందితుల సమాచారంతో సిమ్డేగా అటవీ ప్రాంతంలో తవ్వకాలు జరిపిన పోలీసులు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలిని, మృతదేహాలను తరలించిన అంబులెన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నిందితుల తల్లిదండ్రులను కూడా పోలీసులు అరెస్టు చేసి లోతుగా విచారిస్తున్నారు.

Tags: