Holidays List 2027: 2027 హాలిడేస్ వచ్చేశాయ్.. వచ్చే ఏడాది ఎన్ని సెలవులో తెలుసా?
Holidays List 2027: 2027 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాను కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ విడుదల చేసింది. పండుగలు, జాతీయ సెలవుల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
Holidays List 2027: 2027 హాలిడేస్ వచ్చేశాయ్.. వచ్చే ఏడాది ఎన్ని సెలవులో తెలుసా?
Holidays List 2027: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2027 సంవత్సరపు సెలవుల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ (DoPT) ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం ఢిల్లీతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సాధారణ (Gazetted), ఐచ్ఛిక (Restricted) సెలవులను ఖరారు చేసింది.
ఢిల్లీలోని కార్యాలయాలకు 17 సాధారణ సెలవులు ఉంటాయి. వీటికి అదనంగా 32 రెస్ట్రిక్టెడ్ హాలిడేస్ (RH) జాబితా నుంచి ఉద్యోగులు తమకు నచ్చిన రెండు సెలవులను ఎంపిక చేసుకోవచ్చు.
ఢిల్లీ వెలుపల ఉన్న కార్యాలయాలకు 14 తప్పనిసరి సెలవులు అమలవుతాయి. స్థానిక పరిస్థితులు, సంప్రదాయాలను బట్టి 12 ఐచ్ఛిక పండుగల జాబితా నుంచి మూడు సెలవులను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు.
పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకు మూడు జాతీయ సెలవులతో (జనవరి 26, ఆగస్టు 15, అక్టోబర్ 2) కలిపి గరిష్ఠంగా 16 సెలవులు ఉంటాయి. బ్యాంకులకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక మార్గదర్శకాలు వర్తిస్తాయి.
2027 కేంద్ర కార్యాలయాల సాధారణ సెలవుల పూర్తి జాబితా:
జనవరి 26 (మంగళవారం): గణతంత్ర దినోత్సవం
మార్చి 10 (బుధవారం): ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్)
మార్చి 23 (మంగళవారం): హోలీ
మార్చి 26 (శుక్రవారం): గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 15 (గురువారం): శ్రీరామనవమి
ఏప్రిల్ 19 (సోమవారం): మహావీర్ జయంతి
మే 17 (సోమవారం): ఈద్-ఉల్-జుహా (బక్రీద్)
మే 20 (గురువారం): బుద్ధ పూర్ణిమ
జూన్ 16 (బుధవారం): మొహర్రం
ఆగస్టు 15 (ఆదివారం): స్వాతంత్ర్య దినోత్సవం & మిలాద్-ఉన్-నబీ
ఆగస్టు 25 (బుధవారం): శ్రీకృష్ణాష్టమి
అక్టోబర్ 2 (శనివారం): మహాత్మా గాంధీ జయంతి
అక్టోబర్ 9 (శనివారం): విజయదశమి (దసరా)
అక్టోబర్ 29 (శుక్రవారం): దీపావళి
నవంబర్ 14 (ఆదివారం): గురునానక్ జయంతి
డిసెంబర్ 25 (శనివారం): క్రిస్మస్
రాష్ట్రాల కార్యాలయాలకు 12 ఐచ్ఛిక సెలవులు & కీలక నిబంధనలు:
3 సెలవుల ఎంపిక: రాష్ట్రాల కార్యాలయాలకు కేటాయించిన 12 ఐచ్ఛిక సెలవుల్లో (దసరా అదనపు రోజు, హోలీ, జన్మాష్టమి, శ్రీరామనవమి, మహా శివరాత్రి, వినాయక చవితి, మకర సంక్రాంతి, రథయాత్ర, ఓనమ్, పొంగల్, వసంత పంచమి, ఉగాది/గుడి పడ్వా/బిహు/వైశాఖి/ఛత్ పూజ/కర్వా చౌత్) ఏవైనా మూడు ఎంచుకోవాల్సి ఉంటుంది.
తేదీల్లో మార్పులకు అవకాశం: నెలవంక దర్శనం ఆధారంగా వచ్చే ముస్లిం పండుగల తేదీల్లో అవసరమైతే మార్పులు చేసే అధికారం సంబంధిత సమన్వయ కమిటీలకు ఉంటుంది. అలాగే కొన్ని రాష్ట్రాల్లో నరక చతుర్దశి రోజున దీపావళి సెలవు ప్రకటిస్తే, అక్కడి కేంద్ర కార్యాలయాలు కూడా అదే రోజు సెలవు పాటించవచ్చు.
ప్రత్యామ్నాయ సెలవు ఉండదు: 2027లో స్వాతంత్ర్య దినోత్సవం, గురునానక్ జయంతి వంటివి ఆదివారాల్లో వచ్చాయి. పండుగ సెలవు ఆదివారం లేదా సాధారణ వారాంతపు సెలవు రోజున వస్తే ప్రత్యామ్నాయ సెలవు ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.