India Opposes UN OIC Resolution Turkey Bias

ఐక్యరాజ్యసమితి (UN) వేదికపై టర్కీ అనుసరించిన పక్షపాత వైఖరిపై భారతదేశం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఐక్యరాజ్యసమితి , ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) మధ్య సహకారానికి సంబంధించిన ముసాయిదా తీర్మానంపై జరిగిన సంప్రదింపుల నుంచి భారత్‌తో పాటు మరికొన్ని సభ్య దేశాలను టర్కీ ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టడంపై న్యూఢిల్లీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సోమవారం ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి వ్యతిరేకంగా భారత్ ఓటు వేసింది. ఇరాక్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి టర్కీ మధ్యవర్తిగా (ఫెసిలిటేటర్) వ్యవహరించగా, 112 దేశాలు అనుకూలంగా ఓటు వేయడంతో తీర్మానం ఆమోదం పొందింది. అయితే భారత్‌తో పాటు అమెరికా, ఇజ్రాయెల్, గ్రీస్, సైప్రస్, ఆర్మేనియా దేశాలు ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఓటు వేయగా, 39 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.

ఇది పొరపాటు కాదు, పక్కా ప్రణాళికతో చేసిన కుట్ర: యోజన పటేల్ ఫైర్

ఐక్యరాజ్యసమితిలో భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధి రాయబారి యోజన పటేల్ ఈ అంశంపై మాట్లాడుతూ టర్కీ , ఓఐసీ తీరును ఎండగట్టారు. తీర్మానానికి సంబంధించిన వరుస ముసాయిదాలను పంపిణీ చేసేటప్పుడు భారత ప్రతినిధి బృందంతో పాటు పలు ఇతర దేశాలను ఓఐసీ శాశ్వత పరిశీలక మిషన్ కావాలనే మినహాయించిందని ఆమె ఆరోపించారు. కనీస నిబంధనలను సైతం తుంగలో తొక్కుతూ, కొన్ని దేశాలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన తర్వాత కూడా వాటిని సంప్రదింపుల్లో చేర్చకపోవడం చూస్తుంటే, ఇది పొరపాటున జరిగింది కాదని, పక్కా ప్రణాళికతో చేసిన పని అని స్పష్టమవుతోందని మండిపడ్డారు. కేవలం ఒక సాంకేతిక మార్పుగా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, సార్వభౌమ సమానత్వం , అందరినీ కలుపుకుపోయే ఐరాస మౌలిక సూత్రాలకు ఇది విరుద్ధమని పేర్కొంటూ, ఈ వ్యవహారంపై సర్వసభ్య సమావేశ అధ్యక్షుడు తక్షణమే విచారణ జరిపి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని భారత్ డిమాండ్ చేసింది.

కశ్మీర్ ప్రస్తావనపై మండిపాటు.. పాకిస్థాన్‌కు చురకలు

తీర్మానంలోని అంశాలపైనా భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక ప్రాంతీయ సంస్థ కూడా కాని ఓఐసీ పాత్రను అంతర్జాతీయ వివాదాల పరిష్కారంలోకి విస్తరించాల్సిన అవసరం ఏముందని యోజన పటేల్ ప్రశ్నించారు. అంతేకాకుండా, జూలైలో ఇస్లామాబాద్‌లో జరిగిన ఓఐసీ మహిళా మంత్రుల సమావేశం తాలూకు ప్రకటనను ఈ తీర్మానంలో ప్రస్తావించడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఆ ప్రకటనలో జమ్మూ కశ్మీర్ గురించి నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన వ్యాఖ్యలు ఉన్నాయని, భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ఎలాంటి హక్కు ఓఐసీకి లేదని తేల్చిచెప్పింది. పాకిస్థాన్ పేరును నేరుగా ప్రస్తావించకుండానే, ఒక సభ్య దేశం తన సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం, భారత్‌పై తప్పుడు ఆరోపణలు చేసేందుకు ఓఐసీ వేదికను మరోసారి ఆయుధంగా వాడుకుంటోందని విమర్శించింది. మతంతో సంబంధం లేకుండా తమ పౌరులందరి ప్రయోజనాలను కాపాడుకునే సత్తా సార్వభౌమ దేశాలకు ఉందని, కేవలం ఒకే మతానికి చెందిన వారే ఆ మతస్థులను రక్షించగలరనే తిరోగమన భావాలకు నేటి ప్రపంచంలో స్థానం లేదని భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది.

భారత్‌కు అండగా నిలిచిన యూరోపియన్ యూనియన్, అమెరికా

టర్కీ వ్యవహరించిన తీరుపై కేవలం భారత్ మాత్రమే కాకుండా యూరోపియన్ యూనియన్ (EU) , ఇతర దేశాలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. సంప్రదింపుల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, తమను కావాలనే చర్చల నుంచి దూరం పెట్టారని సైప్రస్ , గ్రీస్ ప్రతినిధులు మండిపడ్డారు. యూరోపియన్ యూనియన్ తరఫున ఐర్లాండ్ మాట్లాడుతూ, తాము చేసిన సూచనలు, సవరణలను కనీసం పరిగణనలోకి తీసుకోకుండానే ముసాయిదాలను ఖరారు చేశారని విమర్శించింది. భవిష్యత్తులోనైనా వివాదాస్పద అంశాలను పక్కనపెట్టి, ఏకాభిప్రాయం కుదిరే సహకార రంగాలపై మాత్రమే దృష్టి సారించాలని అమెరికా సూచించింది. మొత్తంమీద తీర్మానం ఆమోదం పొందినప్పటికీ, టర్కీ , ఓఐసీల ఏకపక్ష వైఖరిని అంతర్జాతీయ వేదికపై ఎండగట్టడంలో భారత్ సఫలమైంది.

Tags: