ప్రసాదం తిన్న పాప.. ఆగ్రహంతో కొట్టిన తల్లి.. చివరకు విషాదం!
Bihar: బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.
ప్రసాదం తిన్న పాప.. ఆగ్రహంతో కొట్టిన తల్లి.. చివరకు విషాదం!
Bihar: పిల్లల శ్రేయస్సు, దీర్ఘాయువు కోసం భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ పూట ఓ కన్నతల్లి కసాయిగా మారింది. ప్రసాదం కోసం తయారు చేసిన ఆహార పదార్థాన్ని పూజకు ముందే తిన్నదనే కోపంతో నాలుగేళ్ల చిన్నారిని తల్లి చితకబాదడంతో ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో జరిగిన ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఉత్తర భారత్‌లోని పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఛఠ్ పూజ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కుటుంబ సభ్యులు, పిల్లల క్షేమం కోసం మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ క్రమంలో ఆదివారం సమస్తిపూర్ జిల్లాకు చెందిన రీనా కుమారి అనే మహిళ ఛఠ్ పూజ కోసం నైవేద్య పదార్థాలను సిద్ధం చేస్తోంది. అయితే, ఆమె నాలుగేళ్ల కుమార్తె సుహాని కుమారి ఆకలితోనో లేక తెలియకనో పూజకు ముందే ఆ ప్రసాదంలోని కొంత ఆహారాన్ని తిన్నది.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లి రీనా కుమారి, ఆ పసిపాపపై చేయి చేసుకుని దారుణంగా కొట్టింది. తల్లి దెబ్బలకు తాళలేక చిన్నారి సుహాని ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు హుటాహుటిన చిన్నారిని సమీపంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌కు తరలించారు. అయితే అప్పటికే సుహాని మరణించినట్లు పరీక్షించిన వైద్యులు ధృవీకరించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుమార్తె మరణానికి కారణమైన తల్లి రీనా కుమారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోస్ట్‌మార్టం నివేదిక అందిన తర్వాత, విచారణ పూర్తయ్యాక చిన్నారి మరణానికి గల కచ్చితమైన కారణాలు వెల్లడవుతాయని పోలీస్ అధికారి తెలిపారు.
మరోవైపు, ఛఠ్ పూజ రోజునే కన్నకూతురిని కోల్పోవడంతో చిన్నారి తండ్రి రాజు పాశ్వాన్ కన్నీరుమున్నీరయ్యాడు. తన కుమార్తె లేని ఈ పండుగకు ఇక ఎలాంటి అర్థం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కన్నబిడ్డను పొట్టనబెట్టుకున్న తన భార్యకు కఠిన శిక్ష పడాలని, తన జీవితంలో ఆమె ఇక అవసరం లేదని తేల్చిచెప్పాడు. మిగిలిన ఇద్దరు పిల్లలను తానే స్వయంగా పెంచుకుంటానని అతడు వాపోయాడు. కాగా, రాజు పాశ్వాన్, రీనా కుమారి దంపతులకు ఏడేళ్ల శివానీ కుమారి, నాలుగేళ్ల సుహాని కుమారి (మృతురాలు), ఏడాదిన్నర వయసున్న రాజా కుమార్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. సుహాని మరణంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.