Nalgonda: బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లపై నలమాస శ్రీకాంత్ గౌడ్ ఫైర్!

Nalgonda: నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అభ్యర్థి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ ప్రధాన రాజకీయ పార్టీల తీరుపై విమర్శలు గుప్పించారు. నల్గొండలోని శాలిని రెసిడెన్సీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

​టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలు, ఉద్యోగ విరమణ వయసు పెంపుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల అవకాశాలను దెబ్బతీసిందని శ్రీకాంత్ గౌడ్ ఆరోపించారు. నీట్, యూజీసీ నెట్ లీకేజీలు, రెండు కోట్ల ఉద్యోగాల హామీపై బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ, యూత్ డిక్లరేషన్ హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

​కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న పల్నాడు వాటర్ గ్రిడ్, అమరజీవి జలధార ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మౌనం వహించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. నల్గొండ రైతుల నీటి హక్కుల కోసం కవిత నాయకత్వంలో నాగార్జునసాగర్ వద్ద భారీ ఉద్యమం చేపడతామని తెలిపారు.

సామాజిక న్యాయం, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతానని పేర్కొంటూ, పట్టభద్రులు తనకు మొదటి లేదా రెండో ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Tags: