Suryapet: సూర్యాపేటలో దారుణం: గోనె సంచిలో బీఆర్ఎస్ నేత మధు శవం లభ్యం!

Suryapet: సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు దారుణ హత్య. ఎల్కారం స్టేజ్ సమీపంలో గోనె సంచిలో శవమై లభ్యం.. పాత కక్షలే కారణమా?

Update: 2026-05-23 07:07 GMT

Suryapet: సూర్యాపేటలో దారుణం: గోనె సంచిలో బీఆర్ఎస్ నేత మధు శవం లభ్యం!

సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో మాజీ సర్పంచ్ భర్త, బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు హత్య స్థానికంగా కలకలం రేపింది. నిన్నటి నుంచి కనిపించకుండా పోయిన మధు మృతదేహం ఎల్కారం స్టేజ్ సమీపంలో గోనె సంచిలో శవమై లభ్యమైంది.

పోలీసుల కథనం ప్రకారం, సూర్యాపేట రూరల్ పరిధి యర్కారం గ్రామానికి చెందిన చింతలపాటి మధు నిన్న ఉదయం ఇంటి నుంచి వెళ్లారు. రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టవర్ లొకేషన్ ఆధారంగా గాలింపు చేపట్టిన పోలీసులకు తెల్లవారుజామున కల్వర్ట్ కింద కట్టిపడేసి ఉన్న మధు మృతదేహం కనిపించింది. దుండగులు కత్తులు, గొడ్డళ్లతో విచక్షణా రహితంగా దాడి చేసి హతమార్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

గతంలో జరిగిన రెండు సంచలన హత్య కేసులతో మధుకు సంబంధం ఉండటంతో ఇది రాజకీయ పాత కక్షల నేపథ్యంలో జరిగిన హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు మధు కాంగ్రెస్ నాయకుడు మిద్దె రవీందర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ నాయకుడు ఒంటెద్దు వెంకన్న హత్య కేసులో A1 విట్నెస్‌గా ఉన్నారు. ఈ కేసు కోర్టు విచారణలో ఉండగానే మధు హత్యకు గురికావడం పలు అనుమానాలకు తావిస్తోంది.

పాత పగలతో తెలిసిన వారే నమ్మకంగా పిలిపించి ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు ఎస్పీ ఆదేశాలతో 5 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. మృతుడి భార్య మాట్లాడుతూ గ్రామానికి చెందిన మారుపల్లి సతీష్, కుంటి గోర్ల సూరి, కందుల నాగయ్య, కట్టబోయిన మల్లయ్య, బొర్రా అరుణ్, మిద్దె జీవన్ కలిసి తన భర్తను హత్య చేశారని పేర్కొన్నారు.

గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సైంటిఫిక్, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితులను త్వరలో అరెస్ట్ చేసి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా కఠిన శిక్ష పడేలా చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.

Tags:    

Similar News