Suryapet: బీఆర్‌ఎస్ నేత, మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధు దారుణ హత్య!
Suryapet: సూర్యాపేట మండలం యర్కారం గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధు దారుణ హత్యకు గురయ్యారు.
Suryapet: బీఆర్‌ఎస్ నేత, మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధు దారుణ హత్య!
సూర్యాపేట: సూర్యాపేట మండలం యర్కారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధును గుర్తు తెలియని దుండగులు కత్తులు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా నరికి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో చుట్టి గ్రామ శివారులోని స్టేజి వద్ద పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మృతుడు మధు సూర్యాపేటలో నివాసం ఉంటుండగా, అక్కడి నుంచి తీసుకెళ్లి హత్య చేసి సొంత గ్రామం యర్కారం వద్ద పడేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. మధు గతంలో సంచలనం సృష్టించిన రెండు హత్య కేసులతో సంబంధం ఉన్న వ్యక్తి. కాంగ్రెస్ నేత మిద్దె రవీందర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉండగా, బీఆర్ఎస్ నేత ఒంటెద్దు వెంకన్న హత్య కేసులో A1 సాక్షిగా ఉన్నారు. ఆ కేసుల ట్రయల్ కోర్టులో నడుస్తుండగానే ఈ హత్య జరిగింది.
రాజకీయ పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మృతుడి భార్య మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన మారుపల్లి సతీష్, కుంటి గోర్ల సూరి, కందుల నాగయ్య, కట్టబోయిన మల్లయ్య, బొర్రా అరుణ్, మిద్దె జీవన్‌లు తన భర్తను హత్య చేశారని ఆరోపించారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనతో యర్కారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.