Suryapet: పట్టణాభివృద్ధికి ₹500 కోట్ల బడ్జెట్ కేటాయించాలి – సీపీఐ(ఎం-ఎల్) మాస్ లైన్
Suryapet: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలను పరిష్కరించాలని, ₹500 కోట్ల బడ్జెట్ కేటాయించాలని మున్సిపల్ కమిషనర్‌కు సీపీఐ(ఎం-ఎల్) మాస్ లైన్ వినతిపత్రం.
Suryapet: పట్టణాభివృద్ధికి ₹500 కోట్ల బడ్జెట్ కేటాయించాలి – సీపీఐ(ఎం-ఎల్) మాస్ లైన్
సూర్యాపేట: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పట్టణ అభివృద్ధికి రూ.500 కోట్ల బడ్జెట్ ను కేటాయించాలని సీపీఐ(ఎం-ఎల్) మాస్ లైన్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
సీపీఐ(ఎం-ఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో జూన్ 2వ తేదీ నుండి ఆగస్టు 20వ తేదీ వరకు సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆ పార్టీ నాయకులు మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ.. పట్టణంలో అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాలువల్లో పూడిక తీయకపోవడంతో మురుగునీరు రోడ్లపైకి వచ్చి దుర్గంధం వెదజల్లుతోందని, ఫాగింగ్ చేయకపోవడంతో మలేరియా, ఫైలేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అనేక వార్డులలో మున్సిపాలిటీ మంచినీటి సరఫరా సరిగా లేదని, చిన్న వ్యాపారులకు అనుకూలమైన స్థలాలు కేటాయించడం లేదని అన్నారు. సూర్యాపేట పట్టణం, పరిసర ప్రాంతాలలో ఉన్న చెరువులను పునరుద్ధరించి తాగు, సాగునీటి అవసరాలకు వినియోగించాలని డిమాండ్ చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు.
మున్సిపాలిటీకి, ప్రభుత్వ హాస్పిటళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్ డిపో సిబ్బందికి మధ్య సమన్వయం లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయని, వీధిలైట్ల ఏర్పాటు, సీసీ రోడ్ల నిర్మాణంలో పారదర్శకత పాటించాలని అన్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కారింగుల వెంకన్న, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్ యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్, పిఓడబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు మారసాని చంద్రకళ, నాయకులు శేషగిరి, కట్ట కల్పన, పజ్జూరి రేణుక తదితరులు పాల్గొన్నారు.