Suryapet: సూర్యాపేటలో రైస్ మిల్లుల ఆకస్మిక తనిఖీ రైతులకు రూ.437 కోట్లు జమ
Suryapet: సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను నాలుగు రోజుల్లో పూర్తి చేస్తామని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు.
Suryapet: సూర్యాపేటలో రైస్ మిల్లుల ఆకస్మిక తనిఖీ రైతులకు రూ.437 కోట్లు జమ
సూర్యాపేట: ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేసి, వచ్చే నాలుగు రోజుల్లో పూర్తి స్థాయిలో కొనుగోళ్లను పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ స్పష్టం చేశారు. గురువారం ఆయన మద్దిరాల, నూతనకల్ మండలాల్లోని పలు రైస్ మిల్లులను ఆకస్మికంగా సందర్శించి, ధాన్యం అన్‌లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 2.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు.
ఇందుకు సంబంధించి రూ.437 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. మిగిలిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేసేందుకు వీలుగా ప్రతిరోజు ట్యాబ్ ఎంట్రీలు, టాక్ షీట్లను నిరంతరం పరిశీలిస్తూ మానిటరింగ్ చేస్తున్నామని చెప్పారు. రోజుకు 10 వేల టన్నుల కొనుగోలు
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసేందుకు మరియు మిల్లుల వద్ద లారీల అన్‌లోడింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఒక ఇన్‌ఛార్జ్ అధికారిని నియమించామని, మిల్లులలో ధాన్యం అన్‌లోడింగ్ వేగంగా జరిగేలా చూసేందుకు ఒక సీనియర్ అధికారితో పాటు, ఒక పోలీస్ అధికారిని నియమించి ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నా మన్నారు.
ప్రస్తుతం జిల్లాలో ప్రతిరోజూ 9 వేల నుండి 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, వెంటనే మిల్లులకు తరలిస్తున్నామని చెప్పారు. ధాన్యం రవాణాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ట్రాన్స్‌పోర్ట్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ కొనుగోలు ప్రక్రియకు ఆటంకం కలగకుండా చూస్తున్నామన్నారు.
వచ్చే నాలుగు రోజులు ధాన్యం కొనుగోళ్లకే అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, జిల్లాలోని పూర్తి స్థాయి ధాన్యాన్ని సేకరిస్తామని రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో డిఆర్డిఓ సన్యాసయ, అడిషనల్ ఫీడ్ చంద్రశేఖర్, మద్దిరాల ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి, నూతనకల్ ఎంపీడీవో సునీత తదితరులు పాల్గొన్నారు.