Suryapet: బుల్లెట్ ట్రైన్ సాధనకై లక్ష గొంతులతో 'పోలికేక' – అఖిలపక్షం పిలుపు

Suryapet: సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ సాధించడమే లక్ష్యంగా ఈ నెల 27న 'లక్ష గొంతుకల పోలికేక' నిరసన. అఖిలపక్ష పోరాట కమిటీ పిలుపు, 10వ రోజుకు చేరిన దీక్షలు.

Update: 2026-08-23 13:42 GMT

Suryapet: బుల్లెట్ ట్రైన్ సాధనకై లక్ష గొంతులతో 'పోలికేక' – అఖిలపక్షం పిలుపు

సూర్యాపేట: బుల్లెట్ ట్రైన్ సూర్యాపేటకు సాధించుకోవాలంటే లక్ష గొంతులతో ఢిల్లీకి పోలికేక చేరాలని బుల్లెట్ ట్రైన్ సాధన అఖిలపక్ష పోరాట కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ ఆరుట్ల జానకిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం సూర్యాపేటలోని బుల్లెట్ ట్రైన్ దీక్షా శిబిరం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్ష గొంతుకల పోలికేక కార్యక్రమ కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రం ఇచ్చిన బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్‌ను అవసరం లేని చోటకు మార్చడం వల్ల జాతీయ రహదారి 65 వెంట ఉన్న పట్టణాలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. దీనిపై పాలకులను నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. గత నెల రోజులుగా ప్రజలు, ఉద్యమ సంఘాలు నిర్విరామంగా ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామన్నారు.

ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈ నెల 27న మంగళవారం సాయంత్రం 7 గంటలకు జిల్లా వ్యాప్తంగా లక్ష గొంతుకలతో పోలికేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లు, షాపులు, సంస్థల ముందు, ప్రధాన కూడళ్ల వద్ద "సాధిస్తాం బుల్లెట్ ట్రైన్ సూర్యాపేటకు" అంటూ మూడుసార్లు పెద్ద ఎత్తున నినాదాలు చేసి ఢిల్లీకి వినిపించేలా నిరసన తెలపాలని కోరారు.

అఖిలపక్షాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలు, అన్ని పార్టీలు విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యంగా జర్నలిస్టులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు పెద్దిరెడ్డి రాజా, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, చల్లమల్ల నరసింహ, మట్టిపల్లి సైదులు, పేర్ల నాగయ్య, పెద్దిరెడ్డి కళ్యాణ్ చక్రవర్తి, జర్నలిస్టు వజ్జే వీరయ్య, హెడ్వర్డ్, ముప్పాని కృష్ణారెడ్డి, వనిత, నేరెళ్ల మధు, చెరుకు లక్ష్మి, భాస్కరమ్మ, రేపాక లింగయ్య, కిరణ్, తన్నీరు వాసు తదితరులు పాల్గొన్నారు.

10వ రోజు దీక్షలో ఆడితీ కమిషన్ వ్యాపారులు

బుల్లెట్ ట్రైన్ సాధన అఖిలపక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 10వ రోజుకు చేరాయి. ఆదివారం ఆడితీ కమిషన్ వ్యాపారులు దీక్షలో పాల్గొన్నారు. బుల్లెట్ ట్రైన్ సాధించే వరకు దీక్షలే కాకుండా సమర పోరాటం సాగిస్తామని వారు తెలిపారు.

వీరి దీక్షకు అఖిలపక్ష నాయకులు ప్రొఫెసర్ జానకిరెడ్డి, రమణాచారి, కర్ణాటి కిషన్, చల్లమల్ల నరసింహ, న్యాయవాది బొల్లెద్దు వెంకటరత్నం, జీడి బిక్షం, డేవిడ్ కుమార్, నవీలే ఉపేందర్, గుండా రమేష్, కిరణ్ తదితరులు సంఘీభావం తెలిపారు.

Tags:    

Similar News