Teja Sajja: తాజ్ కృష్ణ హోటల్లో ఘనంగా హీరో తేజ సజ్జా నిశ్చితార్థం
Teja Sajja: ‘హనుమాన్’ ఫేమ్ యంగ్ హీరో తేజ సజ్జా నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో వైభవంగా జరిగింది.
Teja Sajja: తాజ్ కృష్ణ హోటల్లో ఘనంగా హీరో తేజ సజ్జా నిశ్చితార్థం
Teja Sajja: ‘హనుమాన్’, ‘మిరాయ్’ వంటి పాన్ ఇండియా చిత్రాలతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ నవంబర్ 16న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ తాజ్ కృష్ణ హోటల్లో ఆయన నిశ్చితార్థ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ శుభకార్యానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.
ఈ నిశ్చితార్థ వేడుకకు అతిరథ మహారథులు తరలిరావడంతో తాజ్ కృష్ణ హోటల్ ప్రాంగణం సందడిగా మారింది. తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా విచ్చేసి నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, మాజీ మంత్రి టి. హరీశ్ రావు కూడా హాజరయ్యారు.
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, నేచురల్ స్టార్ నాని, రానా దగ్గుబాటి, శివాజీ, రావు రమేష్, వరలక్ష్మి శరత్ కుమార్ దంపతులు, నిహారిక కొణిదెల, రితికా నాయక్ తదితరులు వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
తేజ సజ్జా కెరీర్లో కీలక పాత్ర పోషించిన దర్శకులు ప్రశాంత్ వర్మ, కార్తీక్ ఘట్టమనేని, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, అనిల్ రావిపూడి, నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, సాహు గారపాటి పాల్గొని ఆశీస్సులు అందించారు.
తన కాబోయే జీవిత భాగస్వామి గురించి తేజ సజ్జా ఇప్పటికే పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తమది పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహమని, వధువు కుటుంబానికి సినీ పరిశ్రమతో ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. అమెరికాలో పెరిగిన ఆమె ప్రస్తుతం తన తండ్రితో కలిసి టెక్నాలజీ రంగంలో వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నట్లు తెలిపారు. ఆమె వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకూడదనే ఉద్దేశంతోనే పేరు, ఇతర వివరాలను గోప్యంగా ఉంచుతున్నట్లు తేజ పేర్కొన్నారు.
నిశ్చితార్థ వేడుక విజయవంతంగా పూర్తి కావడంతో ఇప్పుడు అందరి దృష్టి పెళ్లి వేడుకపై పడింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వచ్చే నెల అంటే డిసెంబర్ 2026లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా తేజ సజ్జా డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. కేవలం కుటుంబ సభ్యులు, అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలోనే వివాహ తంతును నిర్వహించాలని భావిస్తున్నారు.
అనంతరం టాలీవుడ్ ప్రముఖులు, స్నేహితుల కోసం హైదరాబాద్‌లో ఒక గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వివాహ తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.