Shubhalekha Movie: చిరంజీవి మెచ్చిన విశ్వనాథుడి శుభలేఖ

కె. విశ్వనాథ్ దర్శకత్వంలో చిరంజీవి, సుమలత నటించిన శుభలేఖ సినిమా వరకట్న వ్యవస్థ, మహిళా స్వాభిమానం, మానవీయ విలువలను అద్భుతంగా ఆవిష్కరించింది. ఆ విశేషాలను తెలుసుకుందాం.

Update: 2026-06-17 08:24 GMT

Shubhalekha Movie: విశ్వనాథ్‌ సినిమా అంటే కులమత బేధాలు లేకుండా, అన్ని వయసులవారు కలిసి కూర్చొని చూసేంతగా బాగుంటుంది. ఆయన సినిమాల్లో శిల్పంగా కళనే ఎంచుకుంటాడు. ఆ కళ చుట్టూనే సినిమాను నడిపిస్తాడు. కళలో సామాజిక అంశాలను జొప్పించి సున్నితంగా ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా చేస్తారు. సామాజిక అంశాలు హృదయాలను హత్తుకుంటాయి. అయితే, తన పంథాకు కొంత భిన్నంగా ఓ ప్రయోగం చేశారు. అదే శుభలేఖ. ఆనాటి రోజుల్లో ఇంట్లో ఆడపిల్ల ఉంది అంటే నిప్పుల కుంపటే అని అంటారు. పెంచడం ఒకెత్తైతే... ఆడపిల్లకి పెళ్లి చేయడం మరో ఎత్తు. ఈ సున్నితమైన అంశాలను చూపుతూ కె విశ్వనాథ్‌ తీసిన సినిమా శుభలేఖ సినిమా.

వరకట్నం...అసమానతలు

విశ్వనాథ్‌ చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఆనాటి ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటి. నాటి సమాజంలో మగపిల్లలను ప్లస్‌గాను, ఆడపిల్లలను మైనస్‌గాను భావించేవారు. తల్లిదండ్రుల మానసిక సంఘర్షణను, హీరో డిగ్నిటీ ఆఫ్‌ లేబర్‌ని, హీరోయిన్‌తో మహిళల ధృడ వ్యక్తిత్వాన్ని చూపించారు. ఒక విధంగా చెప్పాలి అంటే సినిమాలో ప్రధాన కోణం వరకట్నం. ఇంట్లో మగపిల్లవాడు ఉన్నాడు అంటే అతడికి పెళ్లి చేయడం కోసం సంతలో జంతువులా అమ్మేందుకు సిద్దమౌతారు. ఎవరిపై ఆధారపడకుండా ఎలాగైనా డిగ్రీ పూర్తిచేయాలనే లక్ష్యంతో హీరో డిగ్నిటీ ఆఫ్ లేబర్‌ని నమ్ముకుంటాడు. ఈ పాత్రలో చిరంజీవి నటన అద్భుతం.

ఇక హీరోయిన్‌ సుమలత... పెళ్లి అవసరం అమ్మాయిలకే కాదు... అబ్బాయిలకు కూడా ఉందని, ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులు ఎందుకు శక్తికి మించి కట్నాలు ఇచ్చి కూతురు పెళ్లి చేయాలని ప్రశ్నిస్తుంది. మహిళలకు ధృడమైన వ్యక్తిత్వం ఉండాలని సుమలత పాత్ర ద్వారా కె విశ్వనాథ్‌ చెప్పారు. ఈ సినిమాలోని ప్రతి పాత్ర నాటి సమాజంలోని మనుషుల ఆలోచనలు, వారి తీరుతెన్నులను మనకు పరిచయం చేస్తుంది. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక ఇంటినుంచి బయటకు వచ్చిన సుమలతకు అన్నీ తానై నిలుస్తాడు చిరంజీవి. మనుషుల మధ్య సంబంధాలు ఎలా ఉండాలనే అంశాలను సున్నితంగా, హృద్యంగా చెప్పారు కె విశ్వనాథ్‌.

విశ్వనాథ్‌ ముందుచూపు

ఆరోజుల్లో అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకుంటేనే మూడో ప్రపంచయుద్ధం జరుగుతున్నట్టుగా చూస్తారు. అలాంటిది కలిసి ఉండటం అంటే ఇంకేమన్నా ఉందా? కానీ, ధైర్యం చేస్తే సమాజంలో కాస్త మార్పు తేవచ్చనే ఆలోచన అద్భుతం. ఇల్లు వదిలి వచ్చిన అమ్మాయికి అన్నీ తానై నిలవడమే కాకుండా, ఆమెతో కలిసి ఉంటూ...ఆమెకు గొప్పగా పెళ్లిచేసే బాధ్యత కూడా తీసుకోవడం మరో అద్భుతం. మనుషులు ఎలా ఉండాలో, మానవత్వం ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పిన మహాగొప్ప సినిమా శుభలేఖ. సహజీవనంలోనూ యువతీ యువకుల మధ్య స్నేహం ఎంత పవిత్రంగా ఉంటుందో, ఎంత బాధ్యతగా ఉండాలో మనకు ఈ సినిమాలో చూపించారు. కె విశ్వనాథ్ స్నేహం, సమాజంలో అసమానతలు వంటి అంశాలతో సినిమాను తీయడం, అందులో చిరంజీవి నటించడం మరో మలుపు. ఈ సినిమా ఎంతగా ఇంపాక్ట్‌ చేసిందంటే... కె విశ్వనాథ్‌కి ఉత్తమ దర్శకుడిగా, చిరంజీవికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ అవార్డును తెచ్చిపెట్టాయి. ఈ తెలుగు సినిమాను చూసి ఇన్ఫైర్‌ అయిన బాలీవుడ్‌ హిందీలో రీమేక్‌ చేశారు.  

Tags:    

Similar News