Kokilamma: ఇలాంటి ఎండింగ్‌ ఊహించలేం... కోకిలమ్మ చిత్రాన్ని ఆల్‌టైమ్‌ క్లాసిక్‌గా మార్చిన క్లైమాక్స్

సాధారణ సినిమా అయిన కోకిలమ్మను ప్రేక్షకులు ఆల్‌టైమ్‌ క్లాసిక్స్‌గా మార్చడం వెనుక కారణం క్లైమాక్స్‌. క్లైమాక్స్‌ ఎందుకు అలా పెట్టారో మీరే చూడండి.

Update: 2026-06-16 08:08 GMT

Kokilamma: ఒక సాధారణ సినిమాను మహత్తర కావ్యంగా మార్చేది దాని ముగింపు మాత్రమే. 1983లో ప్రముఖ నటి సరిత ప్రధాన పాత్రలో వచ్చిన ‘కోకిలమ్మ’ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోవడానికి కారణం... గుండెల్ని పిండేసే క్లైమాక్స్. స్వార్ధానికి, ఆత్మగౌరవానికి మధ్య జరిగిన పోరాటంలో ఒక అంగవైకల్యం ఉన్న స్త్రీ చూపిన మానసిక స్థైర్యం ఈ సినిమాను ఆల్‌టైమ్‌ ఫేమస్ చేసింది. సామాన్య ప్రేక్షకుడికి సైతం కన్నీళ్లు తెప్పించే ఈ కథా విశ్లేషణను ఇప్పుడు చూద్దాం.

ఒక అమాయకపు మహిళ కథ

కోకిల ఒక కాంపౌండ్‌లోని ఇళ్లల్లో పనులు చేసుకుంటూ జీవనం సాగించే పనిమనిషి. ఆమెకు పుట్టుకతోనే చెవుడు ఉన్నా, ఎదుటివారి పెదవుల కదలికలను బట్టి విషయాన్ని అర్థం చేసుకుంటుంది. అదే కాంపౌండ్‌లో ఉండే రాజా అనే యువకుడిలోని గాయకుడిని గుర్తించి, అప్పులు చేసి మరీ అతనికి సంగీతం నేర్పిస్తుంది. కానీ రాజా పెద్ద స్టార్ అయ్యాక, ఎక్కువ ఆస్తి ఉందనే ఆశతో ఒక ధనిక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు. ఒక కచేరీ వేదికపై రాజా పెళ్లి ప్రకటన చేస్తుంటే... వినపడని కోకిల, అతనికి సన్మానం చేస్తున్నారనుకుని అమాయకంగా చప్పట్లు కొట్టే దృశ్యం ప్రేక్షకుడి గుండెను ద్రవింపజేస్తుంది.

సినిమాను నిలబెట్టిన ఆ ‘రెండు’ కీలక మలుపులు

చివర్లో రాజా తన తప్పు తెలుసుకుని క్షమాపణలు కోరినా, కోకిల తన ఆత్మగౌరవాన్ని కోల్పోదు. పాత కాంపౌండ్‌లో పని పోవడంతో, చివరకు రోడ్డుపై వాల్ పోస్టర్లు అతికించే పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఒకరోజు రోడ్డుపై రాజా కారు ఆగిపోతుంది. అక్కడ కోకిలను చూసిన రాజా, తలవంచుకుని. క్షమించు నీకు పెళ్లిచేస్తాను...జీవితానికి లోటు లేకుండా చూస్తాను అని జాలి చూపుతాడు. కోకిలకు రాజా చెప్పినదంతా వినిపిస్తుంది. కానీ, ఏమీ వినపడనట్టుగా ఉంటూ... తనకు చెవుడు ఉందని, తనకు ఏమీ వినపడలేదని గంభీరంగా చెప్పి, ఆగిపోయిన కారును వెనుకనుండి తోసి సహాయం చేసి గర్వంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మహిళలు అణిగిమణిగి ఉండాలనే ఆ రోజుల్లో ఆత్మగౌరవాన్ని కోల్పోకుండా, చేసేది చిన్న పని అయినా...ఓ వ్యక్తి ఎదుగుదలకు కారణం అయ్యి... చివరికి తప్పు తెలుసుకొని క్షమించమని వేడుకున్నా...ఆత్మగౌరవంతో అతని సాయాన్ని తిరస్కరించడమే కాకుండా ఆ సమయంలో కూడా అతనికి సహాయం చేస్తుంది.

ఈ క్లైమాక్స్ ఎందుకు అంత గొప్పదంటే... ఇక్కడ కథానాయిక హీరోపై పగ తీర్చుకోలేదు, అలాగని అతని జాలిని ఆశ్రయించలేదు. తన లోపాన్నేఒక ఆయుధంగా మార్చుకుని, తనను మోసం చేసిన వాడి అహంకారాన్ని దించేసింది. దర్శకుడు ఒకవేళ ఈ ముగింపును మార్చి, హీరో హీరోయిన్లు కలిసిపోయినట్లు పెట్టి ఉంటే ఇది ఒక సాధారణ కమర్షియల్ సినిమా అయ్యేది. కానీ, స్త్రీ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిపినందుకే ‘కోకిలమ్మ’ తెలుగు చిత్రసీమలో ఒక అద్భుత దృశ్యకావ్యంగా మిగిలిపోయింది. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా మాత్రమే వస్తుంటాయి. వచ్చిన ఇలాంటి సినిమాలను ఆదరించడం ప్రేక్షకుల కర్తవ్యం.

 

Tags:    

Similar News