సినీ ఇండస్ట్రీలో విషాదం.. చిరంజీవి సన్నిహితుడు కన్నుమూత!

GV Narayana Rao: ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు (73) అనారోగ్యంతో కన్నుమూశారు.

Update: 2026-08-27 02:53 GMT

సినీ ఇండస్ట్రీలో విషాదం.. చిరంజీవి సన్నిహితుడు కన్నుమూత!

GV Narayana Rao: తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు, ప్రముఖ నిర్మాత జీవీ నారాయణ రావు (73) ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తను నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

మరొక హీరో మన భువి తారాలోకం వీడి గగన మార్గం గుండా ఆ శివుని చేరుకున్నారు. మన అందరి అభిమాన కథానాయకుడు చిరంజీవి గారి బాల్య మిత్రుడు, అజాతశత్రువు, అందరినీ ఆప్యాయంగా పలకరించే మంచి మనిషి మనల్ని వీడి శివైక్యం కావడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. అంటూ కరాటే కళ్యాణి భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు.

1953లో జన్మించిన నారాయణ రావు మద్రాసు ఫిలిం ఇన్‌స్టిట్యూట్ మొదటి బ్యాచ్‌లోనే శిక్షణ పొందారు. 1976లో దర్శక దిగ్గజం కె. బాలచందర్ తెరకెక్కించిన 'అంతులేని కథ' చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. తొలి చిత్రంలోని 'తాళికట్టు శుభవేళ' పాటతో ప్రేక్షకుల మెప్పు పొంది, ఏకంగా ఉత్తమ సహాయ నటుడిగా ప్రతిష్టాత్మక 'నంది' అవార్డును సొంతం చేసుకున్నారు.

'ఒక ఊరి కథ', 'ముత్యాల పల్లకి', 'అంగడి బొమ్మ' చిత్రాల్లో హీరోగా నటించినా, ఆ తర్వాత సహాయ నటుడిగా దాదాపు 100కు పైగా చిత్రాల్లో, పలు టీవీ సీరియళ్లలో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారు.

ఫిలిం ఇన్‌స్టిట్యూట్ రోజుల్లో సూపర్ స్టార్ రజనీకాంత్, నారాయణ రావు బ్యాచ్‌మేట్స్. నాటి నుంచే వారిద్దరి మధ్య మైత్రి కొనసాగింది. మెగాస్టార్ చిరంజీవితో నారాయణ రావుకు ఎంతో సాన్నిహిత్యం ఉంది. 'చట్టానికి కళ్లులేవు', 'మంచు పల్లకి', 'రాజా విక్రమార్క', 'గ్యాంగ్ లీడర్', 'హిట్లర్' వంటి సూపర్ హిట్ చిత్రాల్లో చిరుతో కలిసి నటించారు.

నిర్మాతగా మారి చిరంజీవి కథానాయకుడిగా 'దేవాంతకుడు', ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ 'యముడికి మొగుడు' చిత్రాలను నిర్మించారు. ఆ తర్వాత 'యముడికి మొగుడు' చిత్రాన్ని తమిళంలో తన మిత్రుడు రజనీకాంత్‌తో రీమేక్ చేశారు. ఒక మంచి నటుడిగా, దిగ్గజ హీరోలకు ఆప్తమిత్రుడిగా గుర్తింపు పొందిన జీవీ నారాయణ రావు మృతికి టాలీవుడ్ ప్రముఖులు, సినీ అభిమానులు ఘనంగా నివాళులర్పిస్తున్నారు.

Tags:    

Similar News