I Nobody Review: సామాన్యుడి మెడకు రూ. 17 కోట్ల ఉచ్చు.. చివరికి ఏమైంది..?
I Nobody Review in Telugu: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్, నటి పార్వతి తిరువోతు కాంబినేషన్‌లో తెరకెక్కిన సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ఐ, నోబడీ'. నిస్సామ్ బషీర్ దర్శకత్వంలో
I Nobody Review: సామాన్యుడి మెడకు రూ. 17 కోట్ల ఉచ్చు.. చివరికి ఏమైంది..?
I Nobody Review in Telugu: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్, నటి పార్వతి తిరువోతు కాంబినేషన్‌లో తెరకెక్కిన సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ఐ, నోబడీ'. నిస్సామ్ బషీర్ దర్శకత్వంలో సుప్రియ మీనన్ నిర్మించిన ఈ చిత్రం జులై 9న థియేటర్లలో విడుదలై మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జియో హాట్‌స్టార్' లో మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. డబ్బు చుట్టూ తిరిగే మనుషుల మనస్తత్వాలను, సమాజంలోని విచిత్ర ధోరణిని ఆవిష్కరించిన ఈ కథ ఎలా ఉందో చూద్దాం.
అసలు కథ ఏంటంటే?
రాజీవ్ (పృథ్వీరాజ్ సుకుమార్) ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి. భార్య మీరా (పార్వతి తిరువోతు), ఇద్దరు పిల్లలు జోయా, అమలలతో కూడిన చిన్న కుటుంబం అతనిది. భార్యాభర్తల మధ్య విభేదాలు నడుస్తున్న సమయంలో, ఒకరోజు రాజీవ్ అనుకోకుండా ఓ బ్యాంకుకి వెళ్తాడు. అదే సమయంలో ముగ్గురు సాయుధ దొంగలు ఆ బ్యాంకుపై పడి ఏకంగా రూ. 17 కోట్లు దోచుకుంటారు. అడ్డుకోబోయిన రాజీవ్‌ను అపహరించి, ముసుగు వేసి తమతో పాటు తీసుకెళ్తారు. పోలీసులు వెంటాడుతున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ ముగ్గురు దొంగలూ ప్రాణాలు కోల్పోతారు. ప్రాణాలతో బయటపడిన రాజీవ్‌ను ఆస్పత్రిలో చేర్పిస్తారు. అయితే, ప్రమాదం జరిగిన ప్రాంతంలో దోపిడీ సొమ్ము రూ. 17 కోట్లు ఆచూకీ లభించకపోవడంతో అసలు సస్పెన్స్ మొదలవుతుంది.
రూ.17 కోట్లు ఎక్కడికి పోయాయి?
ఆ రూ. 17 కోట్లు రాజీవే మాయం చేసి ఉంటాడని పోలీసులు, ముఖ్యంగా సస్పెన్షన్‌లో ఉన్న పోలీస్ అధికారి అనస్ (హకీమ్ షాజహాన్) గట్టిగా నమ్ముతాడు. మరోవైపు దొంగల ముఠా సభ్యులు, చుట్టుపక్కల జనాలు కూడా ఆ భారీ సొమ్ము రాజీవ్ దగ్గరే ఉందనే నిశ్చయానికి వస్తారు. అతను ఎంత కాదని చెప్పినా సమాజం నమ్మదు. చివరికి అతను రోడ్డుపై చిన్న ప్రమాదం చేసినా, "నీ దగ్గర రూ. 17 కోట్లు ఉన్నాయి కదా" అంటూ లక్షల్లో డిమాండ్ చేసే పరిస్థితి వస్తుంది. అసలు తనకి ఖాతానే లేని ఆ బ్యాంకుకి రాజీవ్ ఎందుకు వెళ్లాడు? ఆ దొంగిలించిన డబ్బు నిజంగానే రాజీవ్ దగ్గర ఉందా? లేక వేరే ఎక్కడికైనా పోయిందా? ఈ విచిత్రమైన, ప్రమాదకరమైన చిక్కుల నుంచి ఒక సగటు మనిషి ఎలా బయటపడ్డాడు? అనేదే 'ఐ, నోబడీ' మిగతా కథ.
మనుషుల నైజం.. ఆకట్టుకునే సందేశం
"నీ దగ్గర డబ్బు లేకపోతే నువ్వు ఎవడికి కావాలి?" అనే ఒకే ఒక్క సంభాషణ ఈ సినిమా అంతరార్ధాన్ని స్పష్టం చేస్తుంది. సమాజంలో ఒకరి దగ్గర విపరీతమైన డబ్బు ఉందనే ప్రచారం జరిగితే, ఆ వ్యక్తిని చూసే కోణం ఎలా మారిపోతుంది? అతడి నుంచి ఎలాగైనా సొమ్ము రాబట్టాలని జనం చేసే ప్రయత్నాలు ఎలా ఉంటాయి? అనే పాయింట్‌ను దర్శకుడు చాలా సహజంగా తెరకెక్కించాడు. రోడ్డుపై పండ్ల లారీ బోల్తా పడితే బాధితులను వదిలేసి పండ్లు ఏరుకునే జనం లాగే, ఒక చోట దోపిడీ జరిగితే అక్కడ లబ్ధి పొందాలని చూసే మనుషుల స్వభావాన్ని చాలా నైరూప్యంగా చూపించారు. పోలీసుల నిర్లక్ష్యం, మీడియా అతి, రాజకీయ నాయకుల స్వార్థం.. ఇలా ప్రతీ అంశాన్ని వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఆవిష్కరించారు. భార్యాభర్తల బంధం సరిగ్గా ఉన్నప్పుడే పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే సందేశం కూడా అంతర్లీనంగా సాగుతుంది.
నటీనటులు & సాంకేతిక నిపుణులు
పృథ్వీరాజ్ సుకుమార్ మరోసారి తన పకడ్బందీ నటనతో ఒక సగటు మనిషి పడే మానసిక సంఘర్షణను అద్భుతంగా పండించారు. పార్వతి తిరువోతు, హకీమ్ షాజహాన్, అశోకన్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. దినేష్ పురుషోత్తమన్ ఛాయాగ్రహణం, జేక్స్ బిజోయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాయి. రమీస్ ఎడిటింగ్ కట్ కథనం వేగాన్ని తగ్గకుండా చూసింది. సమాజం నగ్నసత్యాన్ని, డబ్బు చుట్టూ తిరిగే క్రూరమైన వ్యవస్థను ప్రతిబింబించే మంచి యాక్షన్ థ్రిల్లర్లను ఆదరించే వారికి 'ఐ, నోబడీ' ఒక మంచి ఓటీటీ ఛాయిస్.