Pokiri: పోకిరిలో ఏముంది అంటే... ప్రేక్షకులు ఇప్పటికీ ఇదే చెబుతారు
ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పోకిరి సినిమాను ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేకపోవడానికి చాలా కారణాలున్నాయి. ఇందులో ప్రధాన కారణం మహేష్‌బాబు అనే చెబుతారు ప్రేక్షకులు.
Pokiri: తెలుగు సినీ చరిత్రలో కొన్ని సినిమాలు మాత్రమే కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ ట్రెండ్ సెట్టర్లుగా నిలిచిపోతాయి. అందులో మొదటి వరుసలో ఉండే చిత్రం సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన 'పోకిరి'. 2006 ఏప్రిల్ 28న విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఉన్న అన్ని ప్రాంతీయ రికార్డులను తిరగరాసి ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అసలు ఈ సినిమాలో అంతగా ఏముంది? ప్రేక్షకులు ఇప్పటికీ ఈ చిత్రాన్ని ఎందుకు అంతగా ఆరాధిస్తారు? అంటే దీని వెనుక పూరి జగన్నాథ్ పాటించిన పక్కా హాలీవుడ్ తరహా నెరేషన్, మహేష్ బాబు అద్భుతమైన నటన ముఖ్య కారణాలని చెప్పవచ్చు.
శ్యామ్ కే నాయుడు వేగం... పూరి మసాలా మ్యాజిక్
'పోకిరి' విజయానికి ప్రధాన కారణం సీన్లలో ఉన్న వేగం. ఏ సన్నివేశం కూడా నత్తనడకన సాగదు. ఈ సినిమాలో రెండు మాఫియా గ్యాంగుల మధ్య మీటింగ్ జరుగుతున్నప్పుడు వాతావరణం ప్రశాంతంగా ఉంటుందని ప్రేక్షకుడు భావిస్తే, హీరో అక్కడ ఊహించని విస్ఫోటనం సృష్టిస్తాడు. "ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా... బుల్లెట్ దిగిందా లేదా!" అంటూ ఇచ్చే ఎలివేషన్ సీన్ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌కి తీసుకొస్తుంది. అంతేకాదు, బాస్కెట్‌బాల్ కోర్టులో పోలీస్ ఆఫీసర్ ఆశిష్ విద్యార్థి వార్నింగ్ ఇవ్వడానికి వస్తే, మహేష్ బాబు ఎదురుదాడి చేసి రివర్స్ వార్నింగ్ ఇవ్వడం ప్రేక్షకుల అహాన్ని సంతృప్తిపరిచేలా ఉంటుంది. శ్యామ్ కే నాయుడు కెమెరా పనితనం వల్ల ప్రతి షాట్ వేగంగా మారిపోతూ ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ కొట్టడానికి స్కోప్ దొరకదు.
పర్ఫెక్ట్ క్యారెక్టరైజేషన్లు ... సూపర్ మ్యూజిక్
మాఫియా నేపథ్యం నడుస్తున్నప్పటికీ, ప్రేక్షకులకు ఎక్కడా అలసట రాకుండా పూరి జగన్నాథ్ వినోదాన్ని బ్యాలెన్స్ చేశారు. బ్రహ్మానందం, ఆలీల కామెడీ ట్రాక్ కథతో సంబంధం లేకుండా సాగుతూ ప్రేక్షకుడికి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. మహేష్, ఇలియానాల మధ్య వచ్చే లిఫ్ట్, లోకల్ ట్రైన్, గోల్కొండ సన్నివేశాలు యూత్‌ను విశేషంగా ఆకట్టుకున్నాయి. అంతేకాదు, ప్రకాష్ రాజ్, అజయ్, సుబ్బరాజు వంటి నటుల టైమింగ్ ప్రతి సన్నివేశాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. దీనికి మణిశర్మ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రీసౌండింగ్ రేంజ్‌లో నిలిచింది. అన్నింటినీ మించి మహేష్ బాబు కొత్త డైలాగ్ మాడ్యులేషన్, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకు అసలైన ప్లస్ పాయింట్. "పోకిరిలో ఏముంది?" అంటే ఏమీ ఆలోచించకుండా "మహేష్ బాబు ఒక్కడు చాలు!" అని చెప్పేలా ఆయన తన నటనతో ఈ చిత్రాన్ని చిరస్థాయిగా నిలిపారు.