Vikram: హీరో విక్రమ్ కొంపముంచిన ఆ వీడియో
Vikram: నటుడు చియాన్ విక్రమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన 'లార్ గిబ్బన్' వీడియో తమిళనాట తీవ్ర వివాదానికి దారితీసింది.
Vikram: హీరో విక్రమ్ కొంపముంచిన ఆ వీడియో
Vikram: సామాజిక మాధ్యమాల్లో జస్ట్ ఒక చిన్న సరదా వీడియో... కానీ అది చియాన్ విక్రమ్‌ను ఊహించని వివాదంలోకి నెట్టేసింది! తమిళనాట పవర్‌ఫుల్ నటుడిగా, విలక్షణ పాత్రలతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న విక్రమ్, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక విదేశీ జీవి వీడియో ఇప్పుడు చట్టపరమైన పెద్ద చిక్కులకే దారితీసింది.
విక్రమ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక క్యూట్ వీడియోను షేర్ చేశారు. అందులో ఆయన తన నివాసంలో ఒక చిన్న కోతితో ఎంతో ఆప్యాయంగా ఆడుకోవడం కనిపించింది. తొలుత అభిమానులు ఆ దృశ్యాన్ని చూసి మురిసిపోయినప్పటికీ, అది ఏమీ సాధారణమైన ప్రాణి కాదు. అంతర్జాతీయంగా అత్యంత రక్షణ కలిగిన లార్ గిబ్బన్ జాతికి చెందిన అరుదైన విదేశీ కోతి అని వన్యప్రాణి సంరక్షకులు వెంటనే గుర్తుపట్టారు.
ఇలాంటి వన్యప్రాణులను తగిన పత్రాలు, అనుమతులు లేకుండా ఇంట్లో పెంచుకోవడం చట్టరీత్యా తీవ్రమైన నేరం. దీంతో నెటిజన్లు, వైల్డ్‌లైఫ్ యాక్టివిస్టులు ఒక్కసారిగా విక్రమ్‌పై మండిపడ్డారు. వివాదం తీవ్రరూపం దాల్చడంతో విక్రమ్ 24 గంటల్లోనే ఆ వీడియోను డిలీట్ చేశారు.
వీడియో డిలీట్ చేసినా వ్యవహారం సర్దుమణగలేదు. ఈ వ్యవహారం విక్రమ్ వియ్యంకుడు, కావిన్‌కేర్ అధినేత సీకే రంగనాథన్ నివాసానికి పాకింది. విక్రమ్ కుమార్తె అక్షితను సీకే రంగనాథన్ కుమారుడు మను రంజిత్‌కు ఇచ్చి వివాహం చేసిన సంగతి తెలిసిందే. ఈ లార్ గిబ్బన్ అసలు నివాసం ఇండోనేషియాలోని దట్టమైన అడవులు.
ఆగ్నేయాసియా నుంచి మణిపూర్ సరిహద్దుల మీదుగా, తమిళనాడులోని ఈరోడ్‌కు... అక్కడి నుంచి చెన్నైలోని రంగనాథన్ నివాసానికి అక్రమ మార్గంలో తరలించినట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. చట్టం, నిబంధనలు కేవలం సామాన్యులకేనా? శ్రీమంతులకు వర్తించవా? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు నిలదీస్తున్నారు.
ఈ ఘటనపై చెన్నై వైల్డ్‌లైఫ్ వార్డెన్ యోగెన్ కులాల తక్షణమే స్పందించారు. అధికారుల బృందంతో కలిసి రంగనాథన్ నివాసానికి వెళ్లి ప్రాథమిక విచారణ చేపట్టారు. లార్ గిబ్బన్ అనేది అంతర్జాతీయ వన్యప్రాణి వాణిజ్య నియంత్రణ ఒప్పందం పరిధిలోకి వస్తుంది. భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద దీనికి పూర్తి రక్షణ ఉంటుంది.
ఈ జీవిని పెంచుకోవడానికి అసలు చట్టబద్ధమైన లైసెన్సులు, పత్రాలు ఉన్నాయా లేదా అనే కోణంలో అటవీశాఖ సమగ్ర ఆధారాలు సేకరిస్తోంది. ఒకవేళ ఇవి అక్రమంగా తీసుకువచ్చినట్లు రుజువైతే కఠిన చర్యలు తప్పవు. అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్న ఈ వైల్డ్‌లైఫ్ వివాదంపై స్టార్ హీరో చియాన్ విక్రమ్ వైపు నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం విశేషం.రాబోయే రోజుల్లో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.