Ramayana : రాముడు వచ్చేస్తున్నాడు.. రణబీర్ రామాయణ టీజర్‌కు సెన్సార్ క్లియరెన్స్.. రిలీజ్ ఎప్పుడంటే ?
Ramayana : రణబీర్ కపూర్ రామాయణ టీజర్‌కు సెన్సార్ బోర్డు యూ సర్టిఫికేట్ ఇచ్చింది. ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి సందర్భంగా టీజర్ విడుదల కానుంది.
Ramayana
Ramayana : భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా రామాయణ. నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ గురించి ఒక అదిరిపోయే వార్త బయటకు వచ్చింది. ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల కానున్న ఈ టీజర్‌కు సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
సెన్సార్ బోర్డు నుంచి యూ సర్టిఫికేట్
రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ మైథలాజికల్ డ్రామా టీజర్‌కు సెన్సార్ బోర్డు క్లీన్ U(యూనివర్సల్) రేటింగ్ ఇచ్చింది. అంటే ఈ సినిమాను చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కలిసి చూడవచ్చు. మార్చి 30న ఈ సర్టిఫికేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈ టీజర్‌కు రామ అనే పేరును ఖరారు చేశారు. దీని రన్‌టైమ్ 2 నిమిషాల 38 సెకన్ల పాటు ఉండబోతోంది. సాధారణంగా టీజర్లు 1 నిమిషం లోపే ఉంటాయి, కానీ ఇది దాదాపు ట్రైలర్ నిడివితో వస్తుండటం అభిమానులకు పండగే అని చెప్పాలి.
హనుమాన్ జయంతి స్పెషల్
శ్రీరామనవమి రోజే నిర్మాత నమిత్ మల్హోత్రా ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ.. ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి పర్వదినాన రామ టీజర్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. భారతీయ సంస్కృతిని, రామాయణ గాథను అత్యున్నత ప్రమాణాలతో, ఎంతో భక్తిశ్రద్ధలతో రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ విజువల్స్ లాస్ ఏంజెల్స్‌లోని ఐమ్యాక్స్ స్క్రీనింగ్‌లో కొంతమందికి చూపించగా, అక్కడ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ విజువల్స్ చూసిన వారంతా హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయని పొగుడుతున్నారు.
🚨 Exclusive : Ramayana Second Asset 'Rama' Glimpse certified by CBFC with 2:38 mts of Runtime 🔥 pic.twitter.com/BkqHrdEPMx
— The Ramayana 🏹 (@RamayanaSaga) March 30, 2026
బలమైన తారాగణం.. దిగ్గజాల సంగీతం
ఈ సినిమాలో కేవలం రణబీర్ మాత్రమే కాదు, భారీ తారాగణం ఉంది. శ్రీరాముడిగా రణబీర్ కపూర్ నటిస్తుండగా, లంకేశ్వరుడు రావణుడిగా కన్నడ స్టార్ యశ్ నటిస్తున్నారు. సీతమ్మ తల్లిగా దక్షిణాది నటి సాయి పల్లవి కనిపిస్తుండగా.. హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం మరో ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఆస్కార్ విజేతలు హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ కలిసి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ కాంబినేషన్ వింటుంటేనే సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
రెండు భాగాలుగా విడుదల.. దీపావళికి పండగ
దర్శకుడు నితీష్ తివారీ ఈ మహాకావ్యాన్ని కేవలం ఒక్క సినిమాతో ముగించడం లేదు. దీన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించారు. మొదటి భాగం రామాయణ పార్ట్ 1 2026 దీపావళికి విడుదల కానుండగా, రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. వీఎఫ్ఎక్స్ పరంగా ఈ సినిమా భారతీయ వెండితెరపై ఒక కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. హాలీవుడ్ సాంకేతిక నిపుణుల సహకారంతో ఈ విజువల్స్ రూపొందిస్తున్నారు.