Movie Releases: ఈరోజు థియేటర్లలో సందడి చేయనున్న 6 సినిమాలు ఇవే!

ఆగస్టు 14న సూర్య, విశాల్, ఇమ్రాన్ హష్మీ సినిమాలతో పాటు ఆరు చిత్రాలు విడుదల కానున్నాయి. ఏ సినిమా ఎందుకు ప్రత్యేకమో తెలుసుకోండి.

Update: 2026-08-14 00:10 GMT

Viswanath And Sons

సినీ ప్రేక్షకులకు ఆగస్టు 14న థియేటర్లలో సందడి నెలకొననుంది. ఒక్కరోజే పలు భాషల్లో ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. సూర్య నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, విశాల్ తెరకెక్కించిన ‘మకుటం’తో పాటు ‘పళ్ళ బురుసు’, ‘అగధ’, ‘ఆవారాపన్ 2’, ‘బట్వారా 1947’ సినిమాలు ఆగస్టు 14న విడుదల కానున్నాయి. ఇక ఆగస్టు 15న ‘హుషార్ పిట్టలు’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

విశ్వనాథ్ అండ్ సన్స్



 


సూర్య కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. మమితా బైజు కథానాయికగా నటించగా, రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు.

పిస్టల్ షూటర్ సంజయ్ విశ్వనాథ్ తన కుమారుడి ఆరోగ్య సమస్యకు పరిష్కారం కోసం అవయవదాతను వెతికే క్రమంలో మ్యాడీ అనే యువతిని కలుస్తాడు. ఆమె పరిచయం తర్వాత తండ్రీకొడుకుల జీవితాల్లో చోటుచేసుకునే మార్పులే కథలో కీలకం.

మకుటం



 


విశాల్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన చిత్రం ‘మకుటం’. దుషార విజయన్, అంజలి కథానాయికలు. ఆర్బీ చౌదరి నిర్మాత.

ఈ సినిమాలో విశాల్ లింగ, కృపాకర్ అనే రెండు భిన్నమైన పాత్రల్లో మూడు విభిన్న గెటప్పుల్లో కనిపించనున్నారు. యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఆగస్టు 14న విడుదల కానుంది.

పళ్ళ బురుసు



 


ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పళ్ళ బురుసు’లో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.

విచిత్రమైన పాత్రలు, సరదా సంఘటనలు, అనూహ్య మలుపులతో పల్లెటూరి నేపథ్యంలో సాగే కథగా ఈ సినిమాను రూపొందించారు. కామెడీతో పాటు భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రచార చిత్రాలు చెబుతున్నాయి.

అగధ



 


శ్రవణ్ రెడ్డి కీలక పాత్రలో నటించిన మిస్టిక్ థ్రిల్లర్ ‘అగధ’. కామాక్షి భాస్కర్ల, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఎంఎస్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఆధ్యాత్మిక అంశాలను మిస్టరీ, థ్రిల్లర్ అంశాలతో మేళవించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేవలం భయపెట్టే సన్నివేశాలకే పరిమితం కాకుండా ఆసక్తికరమైన కథను చూపించనున్నట్లు చిత్రబృందం చెబుతోంది.

ఆవారాపన్ 2



 


2007లో వచ్చిన ‘ఆవారాపన్’కు సీక్వెల్‌గా ‘ఆవారాపన్ 2’ తెరకెక్కింది. ఇమ్రాన్ హష్మీ, దిశా పటానీ జంటగా నటించారు. నితిన్ కక్కర్ దర్శకత్వం వహించారు.

ఇమ్రాన్ హష్మీ ఇందులో శివమ్ పండిట్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, ఇమ్రాన్ డైలాగ్స్, దిశా పటానీ నటన సినిమాపై అంచనాలను పెంచాయి.

బట్వారా 1947



 


సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బట్వారా 1947’. రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం వహించగా, ప్రీతి జింటా, షబానా ఆజ్మీ కీలక పాత్రల్లో నటించారు.

భారత్ విభజన కాలం నాటి హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో ఓ కుటుంబం ఎదుర్కొన్న పరిణామాలను భావోద్వేగభరితంగా తెరకెక్కించినట్లు చిత్రబృందం తెలిపింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 14న ఈ చిత్రం విడుదల కానుంది.

ఆగస్టు 15న ‘హుషార్ పిట్టలు’



 


ఇక స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ‘హుషార్ పిట్టలు’ విడుదల కానుంది. అన్షు, వాసవి గణేశన్ జంటగా నటించిన ఈ చిత్రానికి బిక్షు దర్శకత్వం వహించారు. వెంకట్ యాదవ్ నిర్మించగా, ఏషియన్ సురేశ్ ఫిల్మ్స్ విడుదల చేస్తోంది.

నేటి యువతకు కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు నిర్మాతలు చెబుతున్నారు. సమాజంలో చోటుచేసుకున్న కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా కథను తెరకెక్కించినట్లు దర్శకుడు వెల్లడించారు.

Tags:    

Similar News