Dhurandhar 2 Day 6 Collections: ఆరో రోజూ ఆగని జోరు..దురంధర్ 2 కొత్త చరిత్ర
Dhurandhar 2 Day 6 Collections: రణవీర్-ఆదిత్య ధర్ ల దురంధర్ 2 మూవీ సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన ఆరోరోజూ రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.
Dhurandhar 2 Day 6 Collections
Dhurandhar 2 Day 6 Collections'ధురందర్ 2' సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా వసూళ్లు సాధిస్తోంది . ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొత్తం వసూళ్లు సుమారు 900 కోట్ల రూపాయలు. అది కూడా కేవలం ఆరు రోజుల్లోనే సాధించి కొత్త చరిత్ర సృష్టించింది. ఈ సినిమాను అరబ్ దేశాలలో నిషేధించారు. అయినా.. సినిమా వసూళ్లకు ఏమాత్రం అది అడ్డంకి కాలేదు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ధురందర్: ది రివెంజ్' చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. విడుదలకు ఒక రోజు ముందు, అంటే మార్చి 18న పెయిడ్ ప్రివ్యూస్ వేశారు. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ 2025 డిసెంబర్‌లో విడుదలైంది. అప్పటి నుంచి రణవీర్ సింగ్ ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ చిత్రం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది. విడుదలైన ఆరో రోజే భారీ వసూళ్లు సాధించి 'ధురందర్ 2' మరోసారి చరిత్ర సృష్టించింది.
దురంధర్ పార్ట్ 1 కంటే వేగంగా..
'ధురందర్' విడుదలకు ముందు చాలా ప్రతికూలతలను ఎదుర్కొంది. కానీ, విడులయ్యాకా అన్నీ ఎగిరిపోయాయి. దీంతో దురంధర్ మొదటి భాగం వసూళ్లు 1300 కోట్ల రూపాయలు. ఇప్పుడు దురంధర్ సీక్వెల్ ఆరు రోజుల్లోనే 900 కోట్ల రూపాయలకు చేరుకుంది. కొద్ది రోజుల్లోనే ఇది మొదటి భాగం వసూళ్లను క్రాస్ చేసేస్తుంది. అంటే, మొదటి భాగం మొత్తం రన్ లో వచ్చిన కలెక్షన్స్ దురంధర్ 2కు దాదాపుగా పది రోజుల్లోనే వచ్చేస్తాయి. ఇక థియేట్రికల్ రన్ పూర్తయ్యేసరికి మూవీ ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తుందో చూడాలి.
విదేశాల్లో సునామీ.. టాప్ 5లో..
ఇక దురంధర్ 2 మూవీ కలెక్షన్స్ విషయానికి వస్తే.. 'ధురందర్ 2' బాక్సాఫీస్ వద్ద అక్షరాలా సునామీని సృష్టించింది. ఈ సినిమా వసూళ్లు రోజురోజుకూ పెరుగుతుండగా, విడుదలైన ఆరో రోజే విదేశాల్లో సుమారు రూ. 231.57 కోట్లు వసూలు చేసింది. దీంతో, 'ధురందర్ 2' ప్రపంచవ్యాప్త వసూళ్లు ఇప్పుడు రూ. 919 కోట్లకు చేరుకున్నాయి. ఈ వసూళ్లతో రణ్‌వీర్ చిత్రం నాలుగు చిత్రాలను అధిగమించి, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 5 చిత్రాల జాబితాలోకి ప్రవేశించింది.
'బాలీవుడ్ హంగామా' రిపోర్ట్ ప్రకారం, 'ధురందర్ 2' మూవీ రణబీర్ కపూర్ నటించిన 'యానిమల్' సినిమా జీవితకాల వసూళ్లను అధిగమించింది. 2023లో విడుదలైన ఆ చిత్రం రూ. 917 కోట్లు వసూలు చేయగా, సల్మాన్ ఖాన్ 'బజరంగీ భాయ్‌జాన్' ప్రపంచవ్యాప్తంగా రూ. 918.18 కోట్లు వసూలు చేసింది.
ఆరో రోజు భారత్ లో అదే జోరు..
ధురందర్ 2' విడుదలైన ఆరవ రోజు, అంటే మంగళవారం నాడు భారతదేశంలో రూ. 56.55 కోట్లు వసూలు చేసింది. దీంతో, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు దీని వసూళ్లు రూ. 575.67 కోట్లకు చేరుకున్నాయి. 'ధురందర్ 2' కేవలం ఆరు రోజుల్లోనే రూ. 900 కోట్ల మార్కును దాటి, ఈ మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రం రూ. 1000 కోట్ల రికార్డుకు కేవలం కొన్ని అడుగుల దూరంలో ఉంది.
ఒక్కటే లోపం..
అయితే, 'ధురందర్ 2' ఒక విషయంలో విఫలమైంది. అదేమిటి? ఈ చిత్రం స్థానిక భాషల్లో ఆశించిన స్థాయిలో ఆడలేకపోతోంది. అవును, కన్నడ, తమిళ, మలయాళ, తెలుగు డబ్బింగ్ వెర్షన్లు కూడా ప్రభావం చూపడంలో విఫలమయ్యాయి. పలు కారణాల వల్ల రీజినల్ వెర్షన్స్ విడుదల వాయిదా పడింది. బహుశా ఈ కారణంగానే ఈ చిత్రం ఎక్కువ మందికి చేరలేకపోయిందని భావిస్తున్నారు. ఒకవేళ ఈ మూవీ హిందీతో పాటు అన్ని భాషల్లో వచ్చి ఉంటే కలెక్షన్ల రేంజ్ మరో రకంగా ఉండేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.