Narsapur: గంజాయి సేవిస్తున్న యువకులకు కాలనీవాసుల దేహశుద్ధి!

Narsapur: పట్టణంలో గంజాయి సేవిస్తున్న యువకులకు దేహశుద్ధి చేసిన కాలనీవాసులు. ఘటనా స్థలానికి చేరుకుని గంజాయి ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు.

Update: 2026-08-13 03:35 GMT

Narsapur: గంజాయి సేవిస్తున్న యువకులకు కాలనీవాసుల దేహశుద్ధి!

Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో గంజాయి సేవిస్తున్న యువకులను కాలనీవాసులు పట్టుకుని దేహశుద్ధి చేసిన ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు నర్సాపూర్ పట్టణంలోని ఓ హోటల్‌లో పని చేస్తూ స్థానికంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నాడు.

మంగళవారం రాత్రి పట్టణానికి చెందిన పలువురు యువకులు అతని ఇంట్లోకి వెళ్లి గంజాయి సేవిస్తున్నట్లు కాలనీవాసులు గుర్తించారు. దీంతో ఆ యువకులను పట్టుకుని దేహశుద్ధి చేసినట్లు సమాచారం.

యువకులు గంజాయి సేవిస్తున్నారనే సమాచారం స్థానిక ఎక్సైజ్ అధికారులకు అందడంతో ఎక్సైజ్ ఎస్‌ఐ అజీజ్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంట్లో తనిఖీలు నిర్వహించగా గంజాయి ప్యాకెట్‌తో పాటు కూల్‌డ్రింక్ బాటిల్ లభించడంతో వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై ఎక్సైజ్ శాఖ సీఐ గులాం ముస్తఫాను వివరణ కోరగా.. తమ సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారని తెలిపారు. ఇంట్లో గంజాయి ప్యాకెట్, కూల్‌డ్రింక్ బాటిల్ లభించాయని, ఘటనపై విచారణ కొనసాగుతోందని చెప్పారు. గంజాయి సేవించిన యువకులను త్వరలోనే గుర్తించి పట్టుకుంటామని సీఐ వెల్లడించారు.

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎక్సైజ్ శాఖ సీఐ గులాం ముస్తఫా సూచించారు. ఎవరైనా గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలను విక్రయిస్తున్నట్లు, సరఫరా చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని సీఐ ముస్తఫా తెలిపారు.

నర్సాపూర్ పట్టణంలో యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాల బారిన పడుతున్న ఘటనలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంజాయి విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.

Tags:    

Similar News