Hatnoora: సిరిపురం కరాటే మాస్టర్లను అభినందించిన ఎమ్మెల్యే సునీత!
Hatnoora: హైదరాబాద్‌లో జరిగిన కరాటే ప్రదర్శనలో గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన గ్రాండ్ మాస్టర్ పోచయ్య మహేష్ గౌడ్‌లను ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సన్మానించారు.
Hatnoora: సిరిపురం కరాటే మాస్టర్లను అభినందించిన ఎమ్మెల్యే సునీత!
Karimnagar: మెదక్ జిల్లా హత్నూర మండలం సిరిపురం గ్రామానికి చెందిన గ్రాండ్ మాస్టర్ పోచయ్య, మాస్టర్ మహేష్ గౌడ్ గురు–శిష్యులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఇటీవల నిర్వహించిన కరాటే పోటీల్లో వీరు పాల్గొన్నారు.
లండన్‌కు చెందిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కటా ప్రదర్శనలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 2,000 మంది మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులు ఒకేసారి ప్రదర్శన నిర్వహించారు.
గతంలో ఇంగ్లాండ్‌లో 600 మంది ఒకేసారి కరాటే ప్రదర్శన నిర్వహించి సాధించిన రికార్డును అధిగమిస్తూ హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ భారీ ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదైంది.ఈ ప్రతిష్టాత్మక రికార్డులో సిరిపురం గ్రామానికి చెందిన గ్రాండ్ మాస్టర్ పోచయ్య, ఆయన శిష్యుడు మాస్టర్ మహేష్ గౌడ్ పాల్గొని గ్రామానికి, నియోజకవర్గానికి, ఉమ్మడి మెదక్ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి గురు–శిష్యులను అభినందించారు. గ్రామ మాజీ సర్పంచ్ మచ్చ నరేందర్, నాయకులు వెంకట్ రెడ్డి, పాండు గౌడ్ ఆధ్వర్యంలో గ్రాండ్ మాస్టర్ పోచయ్య, మాస్టర్ మహేష్ గౌడ్‌లను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించడం ఎంతో అభినందనీయమని అన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరుస్తూ ఇలాంటి మరెన్నో విజయాలు సాధించి నియోజకవర్గానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
గ్రామీణ ప్రాంతం నుంచి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా కరాటేలో ప్రతిభ చూపిన గురు–శిష్యులను గ్రామస్థులు, నాయకులు అభినందించారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు.