Nandyal: ఆటోలో వెళ్లి ‘జలధార–జలహారతి’ పనులను తనిఖీ చేసిన కలెక్టర్!

Nandyal: నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం తంగడంచలో జలధార–జలహారతి పనులను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Update: 2026-06-23 13:08 GMT

Nandyal: ఆటోలో వెళ్లి ‘జలధార–జలహారతి’ పనులను తనిఖీ చేసిన కలెక్టర్!

Nandyal: నంద్యాల జిల్లాలో జలధార–జలహారతి పనులను జిల్లా కలెక్టర్ రాజా కుమారి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాహన మార్గం లేకపోవడంతో పొలాల మధ్య ఆటోలో 4 కిలోమీటర్లు ప్రయాణించి పనులను తనిఖీ చేయడం ప్రత్యేకంగా నిలిచింది.

జూపాడుబంగ్లా మండలం తంగడంచ గ్రామంలో జలధార–జలహారతి పథకం కింద చేపట్టిన ఫీడర్ ఛానల్ పునరుద్ధరణ పనులు, చెరువుకు నీరు చేరే సరఫరా కాలువలు మరియు మైనర్ ఇరిగేషన్ ట్యాంకు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పరిశీలించారు.

పనులు జరుగుతున్న ప్రాంతానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో అధికారులు, సిబ్బందితో కలిసి ఆటోలో ప్రయాణించి పొలాల మధ్యుగా దాదాపు 4 కిలోమీటర్ల లోపలికి వెళ్లి ప్రత్యక్షంగా పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా చెరువుకు నీటిని అందిస్తున్న రెండు ఫీడర్ ఛానళ్ల అనుసంధానం, వాటి ద్వారా జరుగుతున్న నీటి ప్రవాహం, సాగునీటికి కలిగే ప్రయోజనాలపై అధికారులతో కలెక్టర్ రాజా కుమారి సమీక్ష నిర్వహించారు.

ఫీడర్ ఛానల్ నిర్మాణ నాణ్యత, భౌగోళిక పరిస్థితులు, నీటి ప్రవాహానికి అనుకూలంగా చేపడుతున్న చర్యలు, పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం కింద రెండు ఫీడర్ ఛానళ్ల అభివృద్ధికి రూ.6.73 లక్షల అంచనా వ్యయంతో పనులు చేపట్టినట్లు అధికారులు వివరించారు.

తనిఖీ సమయంలో చెరువు పరిధిలో కొంత భాగం ఆక్రమణలకు గురైనట్లు గుర్తించిన కలెక్టర్… వాటిని తొలగిస్తే చెరువు నిల్వ సామర్థ్యం సుమారు 20 శాతం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అదనంగా 0.05 ఎంసీఎఫ్‌టీ నీటిని నిల్వ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

చెరువుల అసలు విస్తీర్ణాన్ని పరిరక్షించడం వల్ల భూగర్భ జలాలు పెరగడమే కాకుండా రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం కలుగుతుందని కలెక్టర్ అన్నారు. జలధార–జలహారతి కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, వ్యవసాయాభివృద్ధికి కీలకమని ఆమె పేర్కొన్నారు.

ప్రభుత్వం నిర్దేశించిన గడువులో పనులను పూర్తి చేయడంతో పాటు ప్రతి దశలో సాంకేతిక ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా ప్రజలకు దీర్ఘకాల ప్రయోజనం చేకూరేలా పనులు అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. తనిఖీలో డ్వామా పీడీ సూర్యనారాయణతో పాటు మైనర్ ఇరిగేషన్ మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News