Kurnool: కర్నూలు పార్కు స్థలాలను కబ్జా చేస్తే కేసులు - కమిషనర్

Kurnool: కర్నూలులో పార్కు స్థలాల ఆక్రమణలపై కమిషనర్ చల్లా ఓబులేసు సీరియస్. వీకర్ సెక్షన్ కాలనీలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు. కబ్జాదారులపై క్రిమినల్ కేసులు తప్పవు.

Update: 2026-07-10 12:09 GMT

Kurnool: కర్నూలు పార్కు స్థలాలను కబ్జా చేస్తే కేసులు - కమిషనర్

కర్నూలు: నగరపాలక సంస్థకు చెందిన పార్కుల స్థలాల జోలికి వస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని, క్రిమినల్ కేసులు సైతం నమోదు చేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆక్రమణదారులను హెచ్చరించారు. శుక్రవారం ఆయన వీకర్ సెక్షన్ కాలనీ సమీపంలోని ఎల్.పీ. నెం. 69/87లోని పార్కు స్థలాన్ని పరిశీలించారు.

స్థలాన్ని అన్యాక్రాంతం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు కమిషనర్ దృష్టికి రావడంతో, సదరు స్థలం వద్ద వెంటనే హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో పట్టణ ప్రణాళిక అధికారులు బోర్డును ఏర్పాటు చేశారు. అదేవిధంగా పార్కు స్థలానికి వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వీకర్ సెక్షన్ కాలనీ సమీపంలోని ఎల్.పీ. నెం. 69/87లో సుమారు 40 సెంట్ల పార్కు స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా రాళ్లు పాతినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. గతంలో వాటిని తొలగించినప్పటికీ, ఇటీవల మళ్లీ కొందరు రాళ్లు పాతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎవరైనా పార్కులను అన్యాక్రాంతం చేయాలని చూస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని, ఎవరైనా, ఎంతటివారైనా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా పార్కు స్థలాలను కబ్జా చేయాలని చేస్తుంటే స్థానికులు సైతం అడ్డుకోవాలని, నగరపాలక అధికారులకు సమాచారం ఇవ్వాలని కమిషనర్ సూచించారు.

Tags:    

Similar News