Kurnool: కర్నూలు ఆర్‌డీపీ-3 రహదారికి భూసేకరణపై చర్చ

Kurnool: కర్నూలులో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఆర్‌డీపీ-3 రహదారి నిర్మాణం. భూములు కోల్పోతున్న బాధితులకు నష్టపరిహారం, టీడీఆర్ బాండ్ల వివరాలు వెల్లడించిన కమిషనర్.

Update: 2026-07-09 14:55 GMT

Kurnool: కర్నూలు ఆర్‌డీపీ-3 రహదారికి భూసేకరణపై చర్చ

కర్నూలు: నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే లక్ష్యంతో చేపట్టనున్న ఆర్‌డీపీ-3 రహదారి నిర్మాణానికి భూములు కోల్పోనున్న బాధితులు సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు కోరారు. గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలో బాధితులతో సమావేశం నిర్వహించి, రహదారి నిర్మాణానికి సంబంధించిన వివరాలను వివరించారు.

ఓల్డ్ కల్లూరు వక్కెరవాగు సమీపంలోని హేమలత నగర్ నుంచి మహావీర్ కాలనీ మీదుగా జాతీయ రహదారి–44 (ఎన్‌హెచ్–44)ను అనుసంధానించే ఆర్‌డీపీ-3 రహదారి నిర్మాణం కోసం భూములు కోల్పోనున్న వారికి టీడీఆర్ బాండ్ల జారీ, భవనాలకు చెల్లించే నష్టపరిహారం, ప్రభావిత సర్వే నంబర్లలోని విస్తీర్ణం తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఓల్డ్ కల్లూరు, బళ్లారి చౌరస్తా ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఆర్‌డీపీ-3 రహదారి నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల మొత్తం ఆరు ఆస్తులు ప్రభావితమవనున్నాయని, 50 అడుగుల వెడల్పుతో 290 మీటర్ల పొడవున రహదారిని నిర్మించనున్నట్లు వెల్లడించారు.

ఈ రహదారి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల రాకపోకలకు అనుకూలంగా ఉండటంతో పాటు, ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. నగరాభివృద్ధికి దోహదపడే ఈ ప్రజోపయోగ కార్యక్రమానికి బాధితులు సహకరించి రహదారి నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా తోడ్పాటు అందించాలని కోరారు. ఈ సమావేశంలో పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాషా తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News