Kothagudem: కలెక్టరేట్ ఎదుట సీతారామ ప్రాజెక్టు భూ నిర్వాసితుల ధర్నా

Kothagudem: కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట సీతారామ ప్రాజెక్టు భూ నిర్వాసితుల ధర్నా. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని గిరిజన రైతుల డిమాండ్.

Update: 2026-08-17 17:01 GMT

Kothagudem: కలెక్టరేట్ ఎదుట సీతారామ ప్రాజెక్టు భూ నిర్వాసితుల ధర్నా

కొత్తగూడెం: సీతారామ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన దమ్మపేట మండలం జగ్గారం గ్రామపంచాయతీ పరిధిలోని గిరిజన రైతులు తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా భూ నిర్వాసితులు మాట్లాడుతూ.. జగ్గారం రెవెన్యూ పరిధిలో సీతారామ ప్రాజెక్టు కోసం సుమారు 125 మంది గిరిజన రైతుల భూములను ప్రభుత్వం 2016–17 సంవత్సరంలో స్వాధీనం చేసుకుందని తెలిపారు. అప్పట్లో ఎకరాకు రూ.8 లక్షల చొప్పున నష్టపరిహారం అవార్డు నిర్ణయించినప్పటికీ, ఇప్పటివరకు తమకు పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

భూసేకరణ జరిగి ఏళ్లు గడుస్తున్నా నష్టపరిహారం అందకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు పేర్కొన్నారు. ప్రస్తుతం భూముల ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసి, ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం కొత్తగా నష్టపరిహారం నిర్ణయించి చెల్లించాలని డిమాండ్ చేశారు.

స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు స్పందించి సీతారామ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన 125 మంది గిరిజన రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ప్రస్తుత భూముల విలువకు అనుగుణంగా నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తక్షణమే తమ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో.. కారం వసంతరావు, కల్లూరి రాజేష్, కురసం సాయమ్మ, మడకం నరసింహారావు, కురసం చిన్న రాజులు, సున్నం వెంకటేశ్వర్లు తదితర గిరిజన రైతులు పాల్గొన్నారు.

Tags:    

Similar News