Khammam: ఖమ్మం కమిషనర్ చొరవ గుండె వైద్యానికి రూ.14 లక్షల సాయం
Khammam: ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య కృషితో గుండె ఆపరేషన్ విజయవంతం. చిన్నారికి 'జస్విక శ్రీ' అని నామకరణం చేసిన కమిషనర్.
Khammam: ఖమ్మం కమిషనర్ చొరవ గుండె వైద్యానికి రూ.14 లక్షల సాయం
ఖమ్మం: ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన కాంపాటి రాకేష్, మాధవి దంపతులకు 2026 మే 9న ఆడబిడ్డ జన్మించింది. జన్మించిన 12 రోజుల అనంతరం చిన్నారి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిసింది. చిన్నారి వైద్య చికిత్సకు పెద్ద మొత్తంలో ఖర్చు అవసరం కావడంతో ఆ కుటుంబం ఆందోళనకు గురైంది.
ఈ విషయాన్ని ఖమ్మం నగరపాలక సంస్థలో శానిటేషన్ విధులు నిర్వహిస్తున్న చిన్నారి నానమ్మ నరసమ్మ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య దృష్టికి తీసుకువచ్చారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న కమిషనర్ వెంటనే స్పందించి, హృదయ స్వచ్ఛంద సంస్థతో పాటు ప్రభుత్వ సహకారంతో చిన్నారి గుండె శస్త్రచికిత్సకు అవసరమైన రూ.14 లక్షల ఆర్థిక సహాయం మంజూరయ్యేలా కృషి చేశారు.
ఈ సహాయంతో జూలై 28న చిన్నారికి గుండె శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించగా, ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా కోలుకుంది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు తమ కుమార్తెను మున్సిపల్ కమిషనర్ కార్యాలయానికి తీసుకువచ్చి, గ్రీవెన్స్ కార్యక్రమంలో తమకు అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు.
చిన్నారికి మున్సిపల్ కమిషనర్ గారు పేరు పెట్టాలని కుటుంబ సభ్యులు కోరగా, కమిషనర్ అభిషేక్ అగస్త్య సంతోషం వ్యక్తం చేస్తూ చిన్నారికి ‘జస్విక శ్రీ’ అని నామకరణం చేశారు. చిన్నారి సంపూర్ణ ఆరోగ్యంతో, సంతోషంగా ఎదగాలని కమిషనర్ ఆకాంక్షించారు.
ఆపదలో ఉన్న కుటుంబానికి సకాలంలో స్పందించి వైద్య సహాయం అందేలా కృషి చేసిన కమిషనర్ అభిషేక్ అగస్త్యకు చిన్నారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.