Kothagudem: ఆటో కార్మికుల ధర్నాపెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్

Kothagudem: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ కొత్తగూడెంలో ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు ప్లకార్డులతో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు.

Update: 2026-05-27 05:39 GMT

Kothagudem: ఆటో కార్మికుల ధర్నాపెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్

కొత్తగూడెం: డీజిల్, పెట్రోల్ ధరలను రోజురోజుకు పెంచుతున్న విధానాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆటో వర్కర్స్ యూనియన్ ఐఎన్‌టీయూసీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు కనకం సూరిబాబు డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లతో కలిసి మంగళవారం నాడు కొత్తగూడెం పట్టణం సూపర్ బజార్ సెంటర్లో ప్లకార్డలతో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొద్ది రోజుల వ్యవధిలోనే ఇంత భారీగా ఇంధన ధరలు పెరగడం ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం మోపుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల దైనందిన జీవితంలో డీజిల్, పెట్రోల్ కీలక భాగాలుగా మారిన నేపథ్యంలో ధరల పెరుగుదల ప్రభావం అన్ని వర్గాల ప్రజలపై పడుతోందన్నారు. రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి సామాన్య ప్రజల జీవనం మరింత కష్టతరమవుతోందన్నారు.

ముఖ్యంగా ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ఉపాధి అవకాశాలు తగ్గిపోయి కుటుంబ పోషణ కష్టంగా మారిన పరిస్థితిలో ఇంధన ధరల పెరుగుదల ఆటో కార్మికుల జీవితాలను మరింత సంక్షోభంలోకి నెట్టేస్తోందన్నారు. రోజంతా కష్టపడి పనిచేసినా సంపాదనలో ఎక్కువ భాగం ఇంధన ఖర్చులకే వెళ్తోందని, దీంతో కుటుంబ అవసరాలు తీర్చడం కూడా కష్టమవుతోందని తెలిపారు.

ఇంధన ధరల పెరుగుదల రైతులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. వ్యవసాయ పనుల్లో డీజిల్ వినియోగం అధికంగా ఉండటంతో సాగు ఖర్చులు పెరిగి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఇది మరింత భారంగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వెంటనే ఇంధన ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.

ధరలను నిరంతరం పెంచుతూ పేద, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం మోపడం ప్రజా వ్యతిరేక విధానమని విమర్శించారు. డీజిల్ పెట్రోల్ ధరలను జిఎస్టి పరిధిలోకి తేవాలని ఎన్నిసార్లు విన్నవించినా కేంద్రం పెడచెవిన పెడుతోందని, ప్రజల సంక్షేమాన్ని పక్కనపెట్టి ఇలాంటి నిర్ణయాలు కొనసాగిస్తే కేంద్ర ప్రభుత్వానికి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చల్లంగి శ్రీనివాస్, శోభన్ ,ప్రేమ్, పాషా ,హైమద్, గంగులు, గట్టయ్య ,సర్వయ్య, నరసింహ, మోహన్ ,కుమార్, సికందర్ ,లోక్యా ,శ్యాం కుమార్, ఫిరోజ్, నూర్ మహమ్మద్ ,రమేష్, శివ ,మౌలాలి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News